డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ మంగళవారం పాడేరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో డీఎస్సీ నియామకాలు,నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం పథకం అమలుపై ప్రభుత్వాలను నిలదీశారు.
పాడేరు అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న పాడేరు, అరకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్ధి విభాగం నేతలు
విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి చెలగాటం
● ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, పాడేరు ఎమ్మెల్యే
మెగా డీఎస్సీ పేరుతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న అక్రమా లపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ప్రభుత్వ పాలనలో విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉద్యమం తప్పదు
● భాగ్యలక్ష్మి, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్‌పై ఢిల్లీలో పెద్ద ఎత్తున యువత ఆందోళన చేపట్టినట్టే, ఏపీలో కూటమి ప్రభుత్వం డీఎస్సీ అక్రమాలపైన ఉద్యమం తప్పదని,ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి హెచ్చరించారు.స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన లేకుండానే అనుకూలమైన వ్యక్తులకు 400కు పైగా ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారన్నారు.జాతీయ,రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు ఉద్యోగాలు సాఽధించలేక పోయారన్నారు. నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
● డీఎస్సీ పోస్టుల భర్తీలో లోకేష్ అక్రమాలు ● వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి
● వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘాల డిమాండ్ ● లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక
● పాడేరులో భారీగా నిరసన ర్యాలీ ● ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
సాక్షి, పాడేరు: మెగా డీఎస్సీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించిన నిరసన ర్యాలీకి ఆధ్వర్యం వహించారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన
రాష్ట్రంలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని, పోస్టులను లక్షల రూపాయలకు విక్రయించారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు విమర్శించారు., ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి.
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, విద్యార్థి, యువజన విభాగాల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ ఆయన క్యాంపు కార్యాలయం నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ అంబేడ్కర్ సెంటర్ వరకు కొనసాగింది. జోరువానను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు.
ఒకొక్క పోస్టు రూ.15 లక్షలకు అమ్మకం
అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు విక్రయించి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి ఎంపీపీలు కోరాబు అనూషదేవి, బోయిన కుమారి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు, అరకు నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు కె. ఊర్వశి రాణి, సమిడ పూర్ణిమదేవి, రాష్ట్ర, జిల్లా నాయకులు గబ్బాడి చిట్టిబాబు, బొబ్బిలి లక్ష్మణ్, శెట్టి అప్పాలు, కమ్మిడి అశోక్, శరభ సూర్యనారాయణ, తేడబారికి సురేష్‌కుమార్, వంతాల రాంబాబు, కూడా సుబ్రహ్మణ్యం, కూడా సురేష్, కొండబాబు, గిరిప్రసాద్, పాంగి గణబాబు, కొమ్మ రాంబాబు, బోనంగి రమణ, అనంతగిరి మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు డూరు జయవర్ధని, లకే రామకృష్ణపాత్రుడు, శెట్టి ఆనంద్, లకే రామ సత్యవతి, మాజీ సర్పంచ్‌లు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తల్లికి వందనంలోనూ మోసం
జల్లిపల్లి సుభద్ర, జెడ్పీ చైర్‌పర్సన్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం అత్యంత దురదృష్టకరమని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనల కారణంగా దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఢిల్లీ వేదికగా యువత చేపట్టిన ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చిందని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలోనూ అర్హులైన పలువురు లబ్ధిదారులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. సుమారు 15 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఇప్పటికీ నగదు జమ కాలేదని పేర్కొంటూ, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని కోరారు. రాష్ట్రంలోను ఉద్యమం తప్పదని ఆమె హెచ్చరించారు.


