హరినామమే గిరి హారం | - | Sakshi
Sakshi News home page

హరినామమే గిరి హారం

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

32 కి.మీ సింహ‘గిరి ప్రదక్షిణ’తో

పులకించిన భక్తజనం

చిరుజల్లుల చల్లదనంలో..

మైమరిపించిన గిరిప్రదక్షిణం

ఈసారి యంగ్‌ జోష్‌..

పెద్ద ఎత్తున పాల్గొన్న యువత

ఉదయం 5 గంటలకే

కొబ్బరికాయలతో ఆధ్యాత్మిక శ్రీకారం

మధ్యాహ్నం 2 గంటలకు

వైభవంగా పుష్పరథ యాత్ర

సింహాచలం: ఆషాఢ చతుర్దశి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ మంగళవారం జరిగిన గిరి ప్రదక్షిణ భక్తి పారవశ్యానికి ప్రతీకగా నిలిచింది. లక్షలాది మంది భక్తులు హరినామస్మరణల మధ్య 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అప్పుడప్పుడు కురిసిన చిరుజల్లులు, చల్లని వాతావరణం భక్తుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఉదయం ఐదు గంటల నుంచే కొండదిగువ తొలిపావంచా వద్దకు చేరుకున్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనంతో సింహగిరి పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఈ ఏడాది యువత పెద్ద సంఖ్యలో పాల్గొనగా, తొలిసారిగా గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల సంఖ్య కూడా గణనీయంగా కనిపించింది.

గిరిప్రదక్షిణ మార్గం ఇదే..

అడవివరం, పైనాపిల్‌ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్‌, జోడుగుళ్లపాలెం, అప్పు ఘర్‌, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, మురళీనగర్‌, ప్రహ్లాదపురం మీదుగా సాగిన గిరి ప్రదక్షిణ మార్గమంతా హరినామ ఘోషలతో మారుమోగింది. భక్తుల అడుగులతో గిరివలయం పుణ్యక్షేత్రంగా పరివర్తన చెందగా, ప్రతి కూడలి భజనలు, గోవింద నామస్మరణలు, సేవా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక కాంతిని వెదజల్లింది.

వైభవంగా పుష్పరథ యాత్ర : గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని కొండదిగువ తొలిపావంచా వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు స్వామివారి పుష్పరథ యాత్ర వైభవంగా ప్రారంభమైంది. దేవస్థానం స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్‌, ప్రధానార్చకులు గొడవర్తి కరి సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు జెండా ఊపి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆ క్షణంలో లక్షలాది మంది భక్తులు ‘గోవింద... గోవింద’, ‘జై నృసింహా’ నినాదాలతో మారుమోగించగా, పుష్పాలతో అలంకరించిన రథం భక్తుల మధ్య మహోత్సవ వాతావరణంలో ముందుకు సాగింది.

ఆకట్టుకున్న సాంస్కృతిక కళారూపాలు

రథోత్సవంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులివేషాలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, గ్రామీణ సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాల రవళి, కళాకారుల అడుగుల నడుమ రథయాత్ర కంటికి విందుగా సాగింది.

అడుగడుగునా సేవాస్ఫూర్తి

వైద్య, తాగునీటి సదుపాయాలు: కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్ల మేర 28 ప్రాంతాల్లో విశ్రాంతి స్టాల్స్‌, వైద్య సేవా శిబిరాలను నిర్వహించారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా, 600 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.

భద్రతా చర్యలు: నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.

అన్నదాన సేవలు: దారిపొడవునా వివిధ స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహార పదార్థాలు, లఘుపానీయాలు, స్నాక్స్‌, పండ్లు, బిస్కెట్లు, చెరకు రసం ఉచితంగా పంపిణీ చేసి ఆధ్యాత్మిక ఉదారతను చాటుకున్నాయి.

చోరుల చేతివాటం

పెందుర్తి: గిరి ప్రదక్షిణ వేళ చోరులు చేతివాటం ప్రదర్శించారు. తొలి పావంచా మొదలుకొని అడవివరం, ఆరిలోవ, హనుమంతవాక, నగరంలో పలు చోట్ల మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌లు, నగదు దొంగిలించినట్లు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు బాధితులు ఫిర్యాదులు చేశారు. తొలిపావంచా వద్ద మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైంది. దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

ముఖ్యాంశాలు

● ఉదయం10 గంటల తర్వాత గిరి ప్రదక్షిణ మార్గమంతా జనసంద్రమై, మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథ యాత్ర ప్రారంభమయ్యే సమయానికి తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్‌ వరకు బీఆర్‌టీఎస్‌ రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది.

● తెల్లవారుజామునే ప్రదక్షిణ ప్రారంభించిన అనేక మంది భక్తులు సాయంత్రానికే సింహాచలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 9.30 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి.

● పాత అడవివరం జంక్షన్‌ వద్ద రద్దీ నివారణకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయగా, వర్షంతో బురద ఏర్పడి కొంతమంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

● తొలిపావంచా వద్ద ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా జనసంద్రంలో తప్పిపోయిన వారిని, పిల్లలను బంధువులకు సురక్షితంగా అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement