పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్వాసితుల వినతి
సీలేరు: నిర్వాసిత గ్రామాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడం దారుణమని ఆరోపిస్తూ పార్వతీనగర్, బూసుకొండ, సాండ్‌కోరి గ్రామాల నిర్వాసితులు మంగళవారం జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో తమ గ్రామాలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం సరికాదని వారు పేర్కొన్నారు. హామీలు నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని కోరారు. జేసీ స్పందిస్తూ త్వరలో గ్రామాలను సందర్శించి జెన్‌కో అధికారులతో చర్చించి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నిర్వాసితులు తెలిపారు.


