అక్షర జ్ఞానం కోసం ఆ పసిమొగ్గలు అడుగులన్నీ అడుగడుగునా ప్రాణాంతక గండాలే! చదువుల తల్లిని దర్శించుకోవడానికి ఆ చిన్నారులు కొండకోనలను దాటుతూ, ఉప్పొంగే గెడ్డలను ఎదురుగా చూస్తూ నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాగుతున్న దయనీయ దృశ్యం పెదబయలు మన్యంలో కంటతడి పెట్టిస్తోంది.ప్రభుత్వాలు విద్యా విప్లవం తెస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నా.. మారుమూల గిరిజన గ్రామాలవిద్యార్థులకు మాత్రం ఇప్పటికీ బడి ప్రయాణం నూరేళ్ల ఆయువును తీసేసే సాహసయాత్రలాగే మారుతోంది.
● గిరిశిఖరాల్లో విద్యా దీపాలు కరువు
● గెడ్డలు దాటితేనే బడికి దారి!
● కొండకోనల్లో ప్రాణాంతక గండాలు
● మన్యంలో చదువుకోసం పసిపిల్లల పాట్లు
పెదబయలు: చదువుల తల్లిని దర్శించుకోవాలంటేనే ఆ పసిమొగ్గలు ఎన్నో ప్రాణాంతక ప్రమాదాలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ బడి ప్రతి గడపకూ విద్యను అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నా, మన్యంలోని కొన్ని మారుమూల గ్రామాలకు మాత్రం ఇప్పటికీ అక్షర వెలుగు అందలేదు. బడి కోసం ఆ పసిపిల్లలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.. కొండ కోనలను దాటుతూ, ఉధృతంగా ప్రవహించే గెడ్డలను ఎదురుగా చూస్తూ నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాగుతున్నారు.
కొండ మార్గం.. గండాల ప్రయాణం!
మండలంలోని మారుమూల బొంగరం పంచాయతీ పరిధిలో ఉన్న దోసలబంద, డి.కొత్తూరు, రాళ్లగొంది గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ మూడు గ్రామాలకు కనీసం ఒక ప్రాథమిక పాఠశాల కూడా నోచుకోలేదు. దీంతో ఇక్కడి చిన్నారులు చదువుకోవాలంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న మొట్టలగుమ్మి, కుంబుర్ల పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఆ దారి సులువుగా ఉంటుందా అంటే అదీ లేదు. దారి పొడవునా కొండ మార్గాలు, మరోవైపు ఉప్పొంగి ప్రవహించే గెడ్డలు పసిపిల్లల రాకపోకలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గెడ్డలు పొంగిపొర్లి ఈ గ్రామాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి.
తోడు లేనిదే అడుగు ముందుకు పడదు..
పాఠశాలకు వెళ్లే మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో, పిల్లలను ఒంటరిగా పంపేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. బడికి వెళ్లాలంటే ప్రతిరోజూ గ్రామం నుంచి పెద్దవాళ్లెవరో ఒకరు తోడుగా వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం నిత్యం ఇలా ఉత్కంఠతో కాలం వెళ్లదీస్తున్నామని తల్లితండ్రులు కన్నీటి పర్యమంతమవుతున్నారు.
అధికారుల స్పందన ఎప్పుడు?
ఈ సమస్యపై అనేకసార్లు స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరి నుంచి స్పందన కరవైందని గిరిజన విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు కళ్లు తెరవాలని, ఆ మూడు గ్రామాలకు వెంటనే ఒక ప్రాథమిక పాఠశాలను మంజూరు చేసి పసివాళ్ల కష్టాలు తీర్చాలని గిరిజన విద్యార్థి సంఘ నేతలు బూడిద మాధవరావు, ఈశ్వరరావు, విశ్వనాథం, సత్తిబాబు, సుబ్బారావు తీవ్రంగా డిమాండ్ చేశారు.
మౌలిక వసతులు కల్పించాలి
మూడు గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు సదుపాయంతో పాటు గెడ్డపై వంతెన నిర్మించాలి. వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, పంచాయతీ కేంద్రం బొంగరానికి రావాలన్నా గెడ్డ పొంగి రాకపోకలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అత్యవసర సేవలకు 108 అంబులెన్స్ తదితర సౌకర్యాలు అందాలంటే రోడ్డు సదుపాయం అత్యవసరం.
– బూడిద మాధవరావు, జీఎస్‌యూ జిల్లా కార్యదర్శి, పెదబయలు
పాఠశాల లేక అవస్థలు
పాఠశాల లేక నిత్యం మా పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దోసలబంద, డి.కొత్తూరు, రాళ్లగొంది గ్రామాల్లో 78 కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి 30 మంది విద్యార్థులు మొట్టలగుమ్మి, కుంబుర్ల ప్రాథమిక పాఠశాలలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మా గ్రామాలకు నూతన పాఠశాలలు మంజూరు చేయాలి.
– వనగాలి విశ్వనాథం, విద్యార్థి తండ్రి, దోసలబంద


