నాటి హామీలన్నింటినీ నెరవేర్చండి | - | Sakshi
Sakshi News home page

నాటి హామీలన్నింటినీ నెరవేర్చండి

Jul 23 2026 12:30 AM | Updated on Jul 23 2026 12:30 AM

చర్చల పేరుతో కాలయాపన వద్దు

అఖిలపక్ష నేతల డిమాండ్‌

సాక్షి, పాడేరు: సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో జారీ హామీని వెంటనే అమలు చేయాలని గిరిజన అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ కన్వీనర్‌ ఎస్‌. ధర్మన్నపడాల్‌ అధ్యక్షతన బుధవారం రాత్రి పాడేరు ఏపీటీఎఫ్‌ భవనంలో ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. బాలదేవ్‌, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ మాట్లాడుతూ.. గత ఏడాది స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ పోరాటంతో ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరిందని, 5వ షెడ్యూల్‌ క్లాజ్‌ 2 ప్రకారం ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించడం చట్టపరంగా సాధ్యమేనని స్పష్టంగా తెలిపిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. నిజమైన ఆదివాసీ సంఘాలను కాదని, కొందరిని పిలిచి అభిప్రాయ సేకరణ పేరుతో ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల టీచర్‌ పోస్టులను గిరిజనులు కోల్పోయారని, మళ్లీ వచ్చే అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీ ప్రజాసంఘాలను విచ్ఛిన్నం చేయడానికి గిరిజన మంత్రి చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు, ఆదివాసీ నేతలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు రంపచోడవరం బహిరంగ సభకు వస్తున్నారని, ఆదివాసీలంతా పెద్దఎత్తున సభకు తరలివెళ్లి సీఎంను కలవాలని కోరారు. ఈ సమావేశంలో పలు సంఘాల నేతలు పల్లుల ప్రసాద్‌, తరడ రాము, సింహద్రి, కొత్తయ్య, మోహన్‌, భీముడు, రంజీత్‌కుమార్‌, సుందర్‌రావు, ఖర్జకుమార్‌, జగన్‌మోహన్‌రావు, కొండబాబు, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement