అరకులోయ టౌన్: గిరిజన ప్రాంతాల్లో వైద్య రంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. బుధవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన నెల రోజుల్లో 135 మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు వైద్యం అందని ద్రాక్షలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే గిరిజనుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ఇంటింటికీ వైద్యం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అప్పట్లో సీజనల్ వ్యాధులు పూర్తిగా అదుపులో ఉండేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. ప్రస్తుతం గిరిజనులు మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో మలేరియా, టైఫాయిడ్ పరీక్షా కిట్లు, తగిన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించి, ఆ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు దోమల నివారణకు ప్రతీ ఇంటి వద్ద ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ పనులు చేపట్టడంతోపాటు మురుగు కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగాల బారిన పడిన ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం వల్లే 104, 108 సేవలు నిలిచిపోయాయని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.
నెల రోజుల్లో 135 మలేరియా,టైఫాయిడ్ కేసులు నమోదు కావడమే నిదర్శనం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శ


