ఈఈ రాజేంద్రప్రసాద్
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నాలుగు యూనిట్లు అందుబాటులో ఉన్నా యని విద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) 471 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా (టార్గెట్) నిర్దేశించిందని తెలిపారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు లోడ్ డిస్పాచ్ అధికారుల ఆదేశాల మేరకు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గత ఏడాది పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో రెండో దశ నిర్మాణ పనుల నేపథ్యంలో రెండు నెలల పాటు సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చిందని, అందుకే గత ఏడాది టార్గెట్ రీచ్ కాలేకపోయామని వివరించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉందని, అయినప్పటికీ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో రోజుకు 1.5 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 39.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ ఏడాది సీలేరు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకన్నా ముందే సాధించేందుకు కృషి చేస్తామని ఈఈ తెలిపారు.


