క్లాప్‌ మిత్రల వెట్టిచాకిరి | - | Sakshi
Sakshi News home page

క్లాప్‌ మిత్రల వెట్టిచాకిరి

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

● నెలకు ఇచ్చేది రూ.6 వేలే.. ● నాలుగు నెలలుగా అందని వైనం ● ఆర్థిక ఇబ్బందుల్లో 532 కుటుంబాలు ● పట్టించుకోని ప్రభుత్వం

సాక్షి, పాడేరు: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం నిరంతరం అష్టకష్టాలు పడుతున్న క్లాప్‌ మిత్రలు వెట్టిచాకిరికి గురవుతున్నారు. ఊరి చెత్తనంతా ఊడుస్తున్న ఈ శ్రామికులకు ఇచ్చే అరకొర వేతనం రూ.6వేలు కూడా నెలనెలా అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు క్లాప్‌ మిత్రలు పారిశుధ్య పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. వీధులను శుభ్రం చేయడంతో పాటు, ఇంటింటికీ రిక్షాతో తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరిస్తూ ఎంతో శ్రమిస్తున్నారు.

నాలుగు నెలలుగా కరువైన వేతనాలు

జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 244 పంచాయతీల్లో మొత్తం 532 మంది క్లాప్‌ మిత్రలు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెలా వేతనాలు అందించడంలో పంచాయతీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. సుమారు 70 శాతం పంచాయతీల్లో నాలుగు నెలలుగా, మిగిలిన పంచాయతీల్లో రెండు నుంచి మూడు నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. జీతాల కోసం పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులను క్లాప్‌ మిత్రలు వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.

15వ ఆర్థిక సంఘ నిధులు పుష్కలం.. కానీ!

ప్రస్తుతం అన్ని పంచాయతీల్లోనూ 15వ ఆర్థిక సంఘ నిధులు పుష్కలంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ నిధులను పారిశుధ్య పనులకు, ఆయా పనులు చేసే క్లాప్‌ మిత్రలు, ఇతర కార్మికుల వేతనాల చెల్లింపులకే అధిక ప్రాధాన్యతగా ఉపయోగించాలి. అయితే, ఇటీవల అన్ని పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమితులైనప్పటికీ, క్లాప్‌ మిత్రల పెండింగ్‌ వేతనాల చెల్లింపునకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. గత సంక్రాంతి పండగ సమయంలో చివరిసారిగా వేతనాలు తీసుకున్నామని, ఆ తర్వాత నుంచి ఇంతవరకు పైసా కూడా చెల్లించలేదని పలువురు క్లాప్‌ మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోదమ్మ పండగలో శ్రమ దోపిడీ..

పాడేరు మోదకొండమ్మజాతర సందర్భంగా ఐదు రోజుల పాటు పారిశుధ్య పనుల కోసం అనేక గ్రామాల నుంచి వచ్చిన క్లాప్‌ మిత్రలు ఎంతో శ్రమించారు. పండగ రోజుల్లో వారి చేత అదనపు పనులు చేయించుకుని, కేవలం భోజనాలు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప.. కనీస అదనపు కూలి కూడా చెల్లించకపోవడంతో వారంతా ఉసూరుమంటున్నారు. జాతర సందర్భంగా పాడేరు పట్టణమంతటా పేరుకుపోయిన చెత్తను తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. పండగ విజయవంతం కావడంలో క్లాప్‌ మిత్రల శ్రమ ఎంతో ఉన్నప్పటికీ, వారి ఐదు రోజుల వెట్టిచాకిరికి కనీస కూలి సొమ్ము కూడా అధికార యంత్రాంగం ఇవ్వకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement