ఎడారి దేశాల్లో..మన్యం సుగంధాలు
విశాఖ మన్యం గిరిజన రైతులు పండించే సేంద్రియ పంటలకు అంతర్జాతీయంగా రెక్కలొస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఎండిన పసుపు కొమ్ములకే పరిమితమైన మార్కెట్, ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది. గిరిజన రైతుల శ్రమను తగ్గిస్తూ, పచ్చి పసుపునే నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు కడపకు చెందిన ఓ యువ వ్యాపారి నడుం బిగించారు. దీంతో అటు రైతులకు లాభసాటి ధర, ఇటు స్థానిక గిరిజనులకు స్థానికంగా ఉపాధి లభిస్తోంది.
పచ్చి పసుపు. అల్లంను
ఏజెన్సీ అల్లం, పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
సాక్షి, పాడేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్‌తో పాటు అరబ్ దేశాల్లో భారీ డిమాండ్ నెలకొంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎండిన పసుపు కొమ్ములు, పసుపు పొడిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే, అరబ్ దేశాల్లో పచ్చి పసుపు వినియోగం అధికంగా ఉండటాన్ని వైఎస్సార్ కడపకు చెందిన ఒక యువ వ్యాపారి గుర్తించారు. దీంతో మన్యం గిరిజనుల నుంచి నేరుగా పచ్చి పసుపు, అల్లాన్ని కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
ధరల వివరాలు..
పచ్చి పసుపు: ప్రస్తుతం గిరిజన రైతుల నుంచి కిలో రూ. 20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా 8 కిలోల పచ్చి పసుపును ఉడకబెట్టి ఆరబెడితేనే ఒక కిలో ఎండు పసుపు వస్తుంది. సంతల్లో ఎండు పసుపు కిలో రూ. 135 వరకు పలుకుతోంది. పచ్చి పసుపును నేరుగా అమ్మడం వల్ల రైతులకు ఉడకబెట్టే, ఆరబెట్టే శ్రమ తగ్గడమే కాకుండా ఆర్థికంగానూ మంచి లాభం చేకూరుతోంది.
అల్లం: కిలో అల్లం రూ. 35 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ మార్కెట్‌లో పచ్చి అల్లానికి ఉన్న విపరీతమైన డిమాండ్ గిరిజన రైతులకు వరంగా మారింది.
ఎగుమతి ఇలా..
హుకుంపేట మండలం బర్మన్‌గూడ కేంద్రంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 15 టన్నుల పచ్చి పసుపు, 15 టన్నుల అల్లాన్ని సేకరించారు. వీటిని శుభ్రం చేసి 3 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఈ 30 టన్నుల నిల్వలను ముంబైలోని కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి నౌకల ద్వారా దుబాయ్‌కు ఎగుమతి చేస్తారు.
గిరిజనులకు స్థానిక ఉపాధి : ఈ వ్యాపారం వల్ల సుమారు 60 మంది గిరిజన కూలీలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోంది. సేకరించిన పంటను మట్టి లేకుండా కడిగి, ప్యాకింగ్ చేసే పనుల కోసం వీరికి రోజుకు రూ. 400 చొప్పున కూలి చెల్లిస్తున్నారు.
అరబ్ దేశాల్లో భలే డిమాండ్
పచ్చి పసుపు, అల్లానికి దుబాయ్‌తో పాటు అరబిక్ దేశాల్లో అఽధిక డిమాండ్ ఉంది. పచ్చి పసుపునే అక్కడ ప్ర జలు వినియోగిస్తారు. ఆర్గానిక్ అల్లానికి డిమాండ్ ఉంది. తొలిసారిగా మన్యంలో పచ్చి పసుపు, అల్లంను గిరిజన రైతులనుంచి గిట్టుబాటుకు కొనుగోలు చేస్తున్నాం. ఇకపై నిరంతరం పసుపు, అల్లం దుబాయ్‌కు ఎగుమతి చేస్తాం. – టి.రెడ్డి కల్యాణం, ఎండీ, డ్రై మాక్స్ ఆగ్రో ఎంటర్‌ప్రైజేస్, వైఎస్సార్ కడప
పాడేరు ఏజెన్సీలో గిరిజనులు పండించే ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. పచ్చి పసుపును నేరుగా సేకరించి ముంబై మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా, స్థానికంగా చాలా మంది గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. గిరిజన రైతుల కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం
విశేషం.
సాధారణంగా పసుపును ఉడకబెట్టి, ఆరబెట్టి అమ్మడం గిరిజన రైతులకు పెద్ద శ్రమతో కూడుకున్న పని. కానీ, అరబ్ దేశాల్లో పచ్చి పసుపునకు ఉన్న డిమాండ్‌ను గమనించిన యువ వ్యాపారి నేరుగా పొలాల నుంచే పచ్చి పంటను సేకరిస్తున్నారు. హుకుంపేట మండలం కేంద్రంగా జరుగుతున్న ఈ సరికొత్త వాణిజ్యం, మన్యం పసుపు ఘాటును ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోంది.
మన్యం నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్న వైఎస్సార్ కడపకు చెందిన వ్యాపారి
గిరి రైతుల నుంచి అల్లం కిలో రూ.35, పచ్చి పసుపు కిలో రూ.20కు కొనుగోలు
మూడు కిలోల చొప్పున స్థానికంగా ప్యాకింగ్
ముంబై తరలింపు
అక్కడ నుంచి కంటైనర్‌లో దుబాయ్‌కు ఎగుమతి
గిరిజన రైతులకు తగ్గిన శ్రమ
ఎడారి దేశాల్లో..మన్యం సుగంధాలు
ఎడారి దేశాల్లో..మన్యం సుగంధాలు
ఎడారి దేశాల్లో..మన్యం సుగంధాలు


