27న చలో ఐటీడీఏ
మేడూరులో నిరసన తెలియజేస్తున్న గిరిజన సంఘ నాయకులు
చింతపల్లి: ఆదివాసీ గిరిజన కుటుంబాలకు పీఎం జన్‌మన్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 27న చేపట్టనున్న చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి పడాల్ కోరారు. బుధవారం లోతుగెడ్డ పంచాయతీలోని మేడూరు, రామారావు పాలెం, కొలంబంద, కోటకొండ, చోడురాయి గ్రామాల్లో గిరిజనులకు కరపత్రాలను అందజేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలకు పక్కా ఇళ్ల నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గృహాలను మంజూరు చేసిందని, అయితే వాటి నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ నిరసనలో గిరిజనులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం. బాబూరావు, పీసా కమిటీ కార్యదర్శి అప్పారావు, వీరబాబు, మంగురు, దాసు తదితరులు పాల్గొన్నారు.


