గిరిజనుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
సాక్షి, పాడేరు: గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములకు సాగు హక్కులు కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు హేమంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన పాడేరు మండలం మోదాపల్లి, జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి గ్రామాల్లో పర్యటించారు. అటవీ హక్కుల చట్టం ద్వారా భూములు పొందిన గిరిజనులతో ఆయన సమావేశమయ్యారు. వారు సాగు చేస్తున్న భూములు, పండిస్తున్న పంటలు మరియు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గిరిజనుల సామాజిక, మానవ హక్కులను కాపాడవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.జిల్లాలో ఇప్పటివరకు 1.89 లక్షల ఎకరాల అటవీ భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.అటవీ భూములను సద్వినియోగం చేసుకుంటూ వాణిజ్య పంటల సాగుతో గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్ సమన్వయకర్త ఆదినారాయణ, పాడేరు ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వర్లు, ఐటీడీఏ కాఫీ విభాగం ఇన్‌చార్జి ఏడీ బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన ఉత్పత్తులకు
అంతర్జాతీయ బ్రాండింగ్
చింతపల్లి గిరిజన ప్రాంత ఉత్పత్తులకు కాఫీ తరహాలోనే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పరిశీలకుడు హేమంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన మ్యూజియంను, ఐటీడీఏ ఆధ్వర్యంలోని కాఫీ ఎకో–పల్పింగ్ యూనిట్‌ను పరిశీలించారు. కాఫీతో పాటు మిరియాలు, పసుపు పంటలకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించాలని, ముఖ్యంగా పసుపు మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాఫీ గింజల సేకరణ, పల్పింగ్, మార్కెటింగ్ ప్రక్రియలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు చెల్లిస్తున్న గిట్టుబాటు ధరలు, బోనస్‌లపై ఏపీవో వెంకటేశ్వర్లు వివరించారు.మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తీసుకున్న చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు వెంకటేశ్వరరావు, బొంజుబాబు, సీతయ్య, రాజు, మాక్స్ అధ్యక్షుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం


