న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
సాక్షి, పాడేరు: తమకు నెలకు రూ. 26 వేల వేతనం పెంచడంతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 2వ తేదీన అమరావతికి తరలివచ్చి ఆందోళన చేస్తామని జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, బుధవారం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న అంగన్‌వాడీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంగన్‌వాడీ వర్కర్లకు రూ. 26వేలు, ఆయాలకు రూ. 20 వేల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 1,810 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చాలని, సిబ్బందికి తక్షణమే పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాల సంఘ జిల్లా అధ్యక్షురాలు నాగమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ.. గతంలో కుప్పంలో జరిగిన అంగన్‌వాడీల ధర్నాలో పాల్గొన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా వేతనాల పెంపుపై స్పందించకపోవడం అన్యాయమని వారు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో మార్చి 2న ‘ఛలో అమరావతి’ పేరుతో భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, ప్రతినిధులు కళావతి, జయలక్ష్మి, మోదకొండమ్మ, రత్నకుమారి మరియు జిల్లాలోని అన్ని మండలాల అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.


