ఉత్సవాలే ముఖ్యమా? | - | Sakshi
Sakshi News home page

ఉత్సవాలే ముఖ్యమా?

Jan 29 2026 6:22 AM | Updated on Jan 29 2026 6:22 AM

ఉత్సవ

ఉత్సవాలే ముఖ్యమా?

సార్వత్రిక ఎన్నికల వేళ అరకు సంతబయలు వేదికగా గిరిజనుల కష్టాలు నా కష్టాలు అంటూ చంద్రబాబు నాయుడు కురిపించిన హామీల జల్లు.. నేడు ఎండమావిలా మారింది. కొండ శిఖరమంత నమ్మకంతో గిరిపుత్రులు ఓట్లు వేస్తే, అధికారంలోకి వచ్చాక ఆ నమ్మకం అట్టడుగున పడిపోయింది. ఉపాధికి భరోసా ఇచ్చే జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ హామీని ప్రభుత్వం అటకెక్కించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సేవలందించే హెల్త్‌ వలంటీర్లు లేక, సరైన వైద్యం అందక పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం మానేసి, ‘అరకు చలి ఉత్సవాల’ పేరుతో రూ.కోట్లు ఖర్చు చేయడం సరికాదని స్థానిక గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. మా ప్రాణాల కంటే మీకు ఉత్సవాలే ముఖ్యామా? అని ప్రశ్నిస్తున్నాయి.
గిరిజన సంక్షేమం కన్నా

సాక్షి, పాడేరు: ఎన్నికల వేళ గిరిజనుల ఓట్ల కోసం ఊదరగొట్టిన హామీలు.. అధికారంలోకి వచ్చాక అటకెక్కాయి. ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగుల ఆశలు, విద్యార్థుల ప్రాణాలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గిరిజనులకు ‘గుండెకాయ’ వంటి జీవో నంబరు మూడు పునరుద్ధరణ, ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్ల నియామకం వంటి కీలక హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు గాలికొదిలేయడంపై మన్యం నివురు గప్పిన నిప్పులా మండుతోంది.

అరకు సంతబయలు సాక్షిగా నమ్మించి..

2024 జనవరి 20న అరకు సంతబయలు సాక్షిగా చంద్రబాబు గిరిజనులకు ఒక భారీ హామీ ఇచ్చారు. జీవో నంబరు మూడును నేనే తెచ్చాను.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని పునరుద్ధరించి నూరు ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా చేస్తాను‘ అని వేలాది మంది ముందు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆ జీవోను రద్దు చేసినా, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేస్తానని నమ్మబలికారు.

అధికారంలోకి వచ్చాక..

గత ఏడాది చేపట్టిన జనరల్‌ డీఎస్సీలో గిరిజనులకు దక్కింది కేవలం ఆరు శాతం ఉద్యోగాలు మాత్రమే. మిగిలిన పోస్టులన్నీ గిరిజనేతరుల పరమయ్యాయి.ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో ఆదివాసీ సంఘాలు ఉద్యమించినా ప్రభుత్వం కనికరించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తూ, గిరిజన యువత ఉపాధి అవకాశాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అందని వైద్యం.. ఆరుతున్న పసి ప్రాణాలు!

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్లను నియమిస్తామని అరకు సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. 18 నెలల పాలన పూర్తవుతున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి హెల్త్‌ వలంటీర్ల ఫైలుపై తొలి సంతకం చేశానని గొప్పలు చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో ఆ ఫైలు ఎక్కడుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

● వైద్య సిబ్బంది లేకపోవడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు తొమ్మిది మంది గిరిజన విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందారు. సకాలంలో ప్రాథమిక చికిత్స అందక, హెచ్‌ఎంలు లేదా వార్డెన్లు ఆసుపత్రులకు తీసుకెళ్లే లోపే విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం కనీస కనికరం చూపడం లేదు.

మన్యం ఆగ్రహం.. పోరాటమే మార్గం!

తమను వంచించిన కూటమి ప్రభుత్వంపై గిరిజన లోకం ఆగ్రహంతో ఉంది. ‘ఓట్ల కోసం అబద్ధపు హామీలిచ్చి మా జీవితాలతో ఆడుకుంటారా?‘ అని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే జీవో నంబరు మూడుకు సమానమైన చట్టం తీసుకురావాలని, ఆశ్రమ పాఠశాలల్లో తక్షణమే హెల్త్‌ వలంటీర్లను నియమించాలని ఏజెన్సీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే గిరిజన ఆగ్రహానికి గురికాక తప్పదని మన్యం ప్రజలు హెచ్చరిస్తున్నారు.

అనారోగ్యంతో పాడేరు ఆస్పత్రికి వచ్చిన గిరిజన విద్యార్థులు, జీవో నంబరు 3 పునరుద్ధరించాలని పాడేరులో ఆదివాసీ ప్రజాసంఘాల అర్ధనగ్న ప్రదర్శన (ఫైల్‌)

ఎన్నికలకు ముందు అరకు సభలో ఇచ్చిన హమీ మేరకు జీవో నంబరు 3 పునరుద్ధరణ,ప్రత్యామ్నాయ జీవో జారీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉంది. నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకు లేకుండానే డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం అన్యాయం.స్పెషల్‌ డీఎస్సీ సాధన కోసం ఆదివాసీ ప్రజాసంఘాలు, నేతలు,గిరిజన అభ్యర్థుల ఉద్యమాన్ని ఆయన పట్టించుకోకపోవడం అన్యాయం.

– పి.అప్పలనరస, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన సంఘం, పాడేరు

హాస్టళ్లలో పిట్టల్లా రాలిపోతున్న పిల్లలు

కానరాని హెల్త్‌ వలంటీర్ల నియామకం

జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ బుట్టదాఖలు

డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు

పట్టించుకోని చంద్రబాబు సర్కారు

నా కుమార్తె వంతాల నందిని రక్తహీనతతో బాధపడుతూ కేజీహెచ్‌లో వైద్యసేవలు పొందుతూ ఈనెల 7వతేదీన మృతిచెందింది. రక్తహీనత సమస్యను సకాలంలో గుర్తించలేదు.తురకలవలస ఆశ్రమ పాఠశాలలో హెల్త్‌వలంటీర్‌,ఇతర వైద్యసిబ్బంది పోస్టులు లేకపోవడంతో రోజువారి ప్రాథిమిక వైద్యసేవలు కరువయ్యాయి.వైద్యసిబ్బంది అందుబాటులో ఉండి ఉంటే సత్వర వైద్యసేవలు అందుతాయి.

– వంతాల సన్యాసిరావు,

మచ్చుపల్లి, పెదబయలు మండలం

గిరిజన అభ్యర్థులంతా నూరుశాతం ఉద్యోగాల జీవో పునరుద్ధరణ, ప్రత్యేక గిరిజన డీఎస్సీ డిమాండ్‌తో రోడ్డెక్కి ఆందోళన చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టలేదు. గిరిజన మంత్రి ఇచ్చిన హమీని కూడా పట్టించుకోలేదు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యేక డీఎస్సీకి అన్ని ఐటీడీఏలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ నివేదిక కూడా ఇంతవరకు కూటమి ప్రభుత్వం బహిరంగ పరచకపోవడం అన్యాయం.

– కూడా రాధాకృష్ణ, స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ, పాడేరు

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన జీవో నంబరు 3 పునరుద్ధరణ హమీ అమలై ఉంటే డీఎస్సీలో టీచర్‌ ఉద్యోగం వచ్చేది. జనరల్‌ డీఎస్సీ కావడంతో గిరిజన టీచర్‌ అభ్యర్థులకు తీవ్రస్థాయిలో అన్యాయం జరిగింది. స్పెషల్‌ డీఎస్సీతోనే మాలాంటి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.

– మఠం శంకర్‌, డైట్‌ అభ్యర్థి,

డుంబ్రిగుడ

ఉత్సవాలే ముఖ్యమా?1
1/6

ఉత్సవాలే ముఖ్యమా?

ఉత్సవాలే ముఖ్యమా?2
2/6

ఉత్సవాలే ముఖ్యమా?

ఉత్సవాలే ముఖ్యమా?3
3/6

ఉత్సవాలే ముఖ్యమా?

ఉత్సవాలే ముఖ్యమా?4
4/6

ఉత్సవాలే ముఖ్యమా?

ఉత్సవాలే ముఖ్యమా?5
5/6

ఉత్సవాలే ముఖ్యమా?

ఉత్సవాలే ముఖ్యమా?6
6/6

ఉత్సవాలే ముఖ్యమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement