చలి ఉత్సవాల వల్లఒరిగిందేమీ లేదు
అరకు ఎమ్మెల్యే
మత్స్యలింగం విమర్శ
అరకులోయ టౌన్: ఈ నెల 29 నుంచి వచ్చేనెల ఒకటి వరకు అరకులో నిర్వహించ తలపెట్టిన ’చలి ఉత్సవాల’ వల్ల స్థానిక గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లేదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాల కోసం కూటమి ప్రభుత్వం రూ. 8 కోట్లు వెచ్చిస్తోందని, ఆ నిధులను గిరిజనాభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని సూచించారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 2, 13, 51లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవి రద్దు చేసిన తర్వాతే సీఎం చంద్రబాబు అరకు రావాలని స్పష్టం చేశారు. జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పి నిరుద్యోగులను మోసగించారని, మెగా డీఎస్సీ పేరుతో గిరిజన యువతకు అన్యాయం చేశారని ఆరోపించారు. ’బెర్రీ బోరర్’ పురుగు వల్ల నష్టపోయిన కాఫీ రైతులకు ఎకరానికి రూ. 5వేలు, కిలో కాఫీకి రూ. 100 చొప్పున పరిహారం ఇవ్వడానికి లేని నిధులు, ఉత్సవాలకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఐటీడీఏ పరిధిలోని మ్యూజియం, పద్మాపురం గార్డెన్, చాపరాయి జలవిహారి వంటి పర్యాటక కేంద్రాల ఆదాయం అధికారుల సొంత ఖాతాల్లోకి వెళ్తోందని, నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన 30 శాతం వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వీటిని పరిష్కరించిన తరువాతనే ముఖ్యమంత్రి చంద్రబాబు అరకులోయ రావాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ సమావేశంలో పద్మాపురం సర్పంచ్ పెట్టెలి సుస్మిత, ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి, పార్టీ ఎస్టీ కమిటీ నియోజకవరర్గ అధ్యక్షుడు కిల్లో నోబో, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు సుక్రయ్య, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జి పాంగి విజయ్, మాజీ సర్పంచ్
జగన్ తదితరులు పాల్గొన్నారు.


