హామీలు నెరవేర్చాకే అడుగు పెట్టండి
ముంచంగిపుట్టు: అబద్ధపు హామీలతో మోసం చేసిన సీఎం చంద్రబాబు, వాటిని నెరవేర్చిన తరువాతనే అరకు రావాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు సూచించారు. బుధవారం నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా జీవో నెంబర్ 3కు సంబంధించి కొత్త జీవోలు తెస్తామన్న మాటను చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించిన ప్రజలను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని, హామీలపై స్పష్టత ఇచ్చిన తర్వాతే పర్యటించాలని.. లేనిపక్షంలో గిరిజనుల ఆగ్రహం తప్పదని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకే నూరుశాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు మాట మార్చి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ,సర్పంచ్ రమేష్,ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, గణపతి, వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొన్నారు.
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు సూచన


