గ్రూప్–2లో మెరిసిన గిరి కుసుమాలు
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం దారకొండ పంచాయతీ తోకరాయి గ్రామానికి చెందిన రెడ్డి విజయశాంతి, గ్రూప్–2 విజేతగా నిలిచి గిరిజన ప్రాంత కీర్తిని చాటారు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి, ఉన్నత లక్ష్యంతో పట్టువదలకుండా పోరాడి నేడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. విజయశాంతి విద్యాభ్యాసం తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. తొలుత ఏపీఆర్ కాలేజీలో టీచర్‌గా, ఆ తర్వాత టీబీ ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేశారు. 2018లో గ్రూప్–3 సాధించి, ప్రస్తుతం చింతపల్లి చౌడిపల్లి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అంతటితో సంతృప్తి చెందకుండా, కఠిన శ్రమతో ఇప్పుడు గ్రూప్–2 సాధించి రాష్ట్రస్థాయి ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యారు. గూడెంకొత్తవీధి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే విజయశాంతి తండ్రి రెడ్డి ధర్మయ్య, తల్లి సావిత్రి తమ నలుగురు ఆడపిల్లలను ఇంటికే పరిమితం చేయకుండా ఉన్నత చదువులు చదివించారు. విజయలక్ష్మి ధారకొండలో సీఆర్పీగా పనిచేస్తున్నారు. విజయశాంతి గ్రూప్–2 విజేతగా నిలిచింది. కమలకుమారి పెదబయలులో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. కృష్ణవేణి ప్రస్తుతం డీఎస్సీకి సిద్ధమవుతోంది. నా నలుగురు ఆడపిల్లలను ఉన్నత స్థానంలో చూడాలనుకున్న నా కల నెరవేరింది. వారు నా ధైర్యం.. అని తండ్రి ధర్మయ్య గర్వంగా చెబితే, తన విజయంలో తల్లిదండ్రులు, అధికారులు ఎంతో సహకరించారని విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు.
డిప్యూటీ కలెక్టరే లక్ష్యం..: లోకవరపు రవి
కొయ్యూరు: మంప పంచాయతీ కార్యదర్శి లోకవరపు రవి గ్రూపు–2 ఫలితాల్లో సత్తా చాటారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. గతంలో రెండుసార్లు గ్రూపు–1 మెయిన్స్ రాసిన అనుభవం ఈ విజయానికి పునాది వేసింది. 2025 ఫిబ్రవరిలో రాసిన మెయిన్స్ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కానీ గ్రూపు–1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టు సాధించడమే.. నా అసలు లక్ష్యమని రవి పేర్కొన్నారు.
గ్రూప్–2లో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రతిభ కనబరిచారు. తోకరాయికి చెందిన రెడ్డి విజయశాంతి, మంప పంచాయతీ కార్యదర్శి లోకవరపు రవి కొలువులు సాధించారు.
గ్రూప్–2లో మెరిసిన గిరి కుసుమాలు


