జీవో నంబరు 3 పునరుద్ధరణపైచంద్రబాబు స్పష్టత ఇవ్వాలి
● గిరిజన డీఎస్సీ సాధన కమిటీ,
ప్రజాసంఘాల డిమాండ్
● పాడేరు ఐటీడీఏ ఎదుట 24గంటల
రిలే నిరాహార దీక్షలు
సాక్షి, పాడేరు: షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జీవో నంబరు 3ను తక్షణమే పునరుద్ధరించాలని, దీనిపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగులు, ఆదివాసీ ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం స్థానిక ఐటీడీఏ ఎదుట 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవోనంబరు 3ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశాయి. 2026 మెగా డీఎస్సీలో ఆదివాసీ నిరుద్యోగులకు ప్రత్యేకంగా టీచర్ పోస్టులు కేటాయించాలని కోరాయి. 2024 ఎన్నికల ముందు అరకు సభలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంగా దీక్షలను ప్రారంభించిన గిరిజన స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ ముఖ్య సలహదారు పి. అప్పలనరస మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా గిరిజన చట్టాల రక్షణపై స్పష్టత ఇవ్వకపోవడం అన్యాయమని విమర్శించారు. హామీలు నెరవేర్చకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సాగిన ధర్మాన్నపడాల్, కో–కన్వీనర్ రాధాకృష్ణ, ఇతర ప్రతినిధులు సత్యనారాయణ, భాను, శంకర్, రాజంనాయుడు, పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.


