ఇల్లా.. కొలనా..! | - | Sakshi
Sakshi News home page

ఇల్లా.. కొలనా..!

Jun 18 2025 11:13 AM | Updated on Jun 18 2025 11:13 AM

ఇల్లా

ఇల్లా.. కొలనా..!

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులకు నిర్మించిన కాలనీ ఇళ్లు కొలనులను తలపిస్తున్నాయి. శ్లాబ్‌లు నాసిరకంగా నిర్మించడం వల్ల నీరు నిలిచిపోయి లీకేజీల నుంచి గదుల్లోకి వచ్చేయడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలోపం వల్ల పనులు ఇష్టారాజ్యంగా జరిగాయి. కనీసం మరమ్మతులైనా చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేకుండా పోయిందని నిర్వాసితులు వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం సర్వం త్యాగంచేసిన తమకు గత టీడీపీ ప్రభుత్వం నరకం చూపించిందని వారు ధ్వజమెత్తుతున్నారు.

అధ్వానంగా పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలు

నాసిరకంగా పనులు

శ్లాబ్‌ లీకేజీల నుంచి

గదుల్లోకి వర్షం నీరు

గత టీడీపీ ప్రభుత్వంలో

ఇష్టారాజ్యంగా కట్టడాలు

నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు

త్యాగం చేసి నరకం చూస్తున్నామని బాధిత ప్రజల ఆవేదన

రంపచోడవరం: పోలవరం ప్రాజెక్ట్‌ గిరిజన నిర్వాసితులకు నిర్మించిన కాలనీ ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో నరకం చూస్తున్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు, తెలిపేరు, తాళ్లూరు, మెట్టగూడెం, తాటివాడ గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్‌ ముంపులో కలిసిపోయాయి. వీళ్లకు 2017–18లో దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు సమీపంలో పెదబియ్యంపల్లిలో 110 ఇళ్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. వీటితోపాటు గుబ్బలంపాడు, రమణయ్యపేట గ్రామాలకు ఇందుకూరుపేటకు సమీపంలో కంబలంపాలెంలో సుమారు వందిళ్లు నిర్మించింది. ఇంజినీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరిగాయి. ఒకొక్క ఇంటికి ప్రభుత్వం రూ.2.5 లక్షలు వెచ్చించింది. నిర్మాణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం పర్యవేక్షణను గాలికొదిలేసింది.తమ ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షణ చేసుకునే అవకాశం కూడా అధికారులు కనీసం తమకు కూడా ఇవ్వలేదని గిరిజన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్నాళ్లకే శిథిలం

నిర్వాసితులు కాలనీలకు వచ్చి నాలుగేళ్లు దాటుతోంది. కాలనీలో ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండడంతో ఒకటి కాదు, రెండు కాదు అన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. శ్లాబ్‌లు ఎత్తుపల్లాలుగా నిర్మించారు. దీంతో వర్షం వచ్చినప్పుడు నీరు శ్లాబ్‌పై ఉండిపోయి ఇంట్లోకి దిగిపోతోంది.

● బాత్‌రూమ్‌ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బేసిన్‌తో సహా ఫ్లోరింగ్‌ కిందికి దిగిపోయింది. ఇంటి వరండా ఫ్లోరింగ్‌ పరిస్థితి అలాగే ఉంది. పెదబియ్యంపల్లి కాలనీలో పూర్తిస్థాయిలో రోడ్ల నిర్మాణం జరగలేదు. సుమారు కిలోమీటరు మేర సిమెంటు రోడ్డు నిర్మించాల్సి ఉంది.

● సితారం నిర్వాసితులకు ఇందుకూరుపేట సమీపంలో ఏర్పాటుచేసిన కాలనీలో మౌలిక వసతులు లేవు. ఇక్కడ సుమారు వంద కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కాలనీ ఇళ్లు నిర్మించింది. ఇప్పటికీ సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం జరగలేదు. దండంగి కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణంలో లోపం వల్ల పూర్తిస్థాయిలో అందరికీ నీరు అందడం లేదు. పల్లపు ప్రాంతంలో నిర్మించడం వల్ల ఎగువ ప్రాంతంలోని ఇళ్లకు నీరు సరఫరా కావడం లేదు.

తాగునీటికి అవస్థలు పడుతున్నాం

సత్యసాయి మంచినీటి పథకం నుంచి కనెక్షన్‌ ఇస్తామని దండంగి పునరావాస కాలనీలో ట్యాంకు ఏర్పాటు చేసి మూడు నెలలు అవుతోంది. నేటికీ పైపులైన్‌ కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. కాలనీకి వచ్చిన తరువాత మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. – మిర్తివాడ వీరపురెడ్డి,

దండంగి కాలనీ, దేవీపట్నం మండలం

వర్షం పడితే చాలా ఇబ్బంది

ఇళ్ల శ్లాబ్‌లు లీక్‌ అవుతున్నందున వర్షం పడినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉంటోంది. శ్లాబ్‌ లీకేజీల నుంచి నీరు గదుల్లోకి వచ్చేస్తోంది. మరమ్మతులు చేపట్టాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.మరుగుదొడ్లు ఎందుకు పనిచేయకుండా పోయాయి. ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.

– కోండ్ల సురేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, పీసా కమిటీ, పెదబియ్యంపల్లి కాలనీ

వినతులిచ్చినా..స్పందన శూన్యం

కాలనీ ఇళ్ల శ్లాబ్‌లపై నీరు నిల్వ ఉండిపోయి కారిపోతుండటంతో ఇటీవల ఐటీడీఏ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొండమొదలు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా నిర్మించడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కంబలంపాలెంలో నిర్మించిన చినరమణయ్యపేట, గుబ్బలంపాడు నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని మాజీ ఎంపీపీ కొమరం పోశమ్మ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు.

ఇల్లా.. కొలనా..!1
1/3

ఇల్లా.. కొలనా..!

ఇల్లా.. కొలనా..!2
2/3

ఇల్లా.. కొలనా..!

ఇల్లా.. కొలనా..!3
3/3

ఇల్లా.. కొలనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement