చింతపల్లి: గిరిజన రైతాంగం సంప్రదాయంగా సాగు చేస్తున్న పంటల విత్తనాలను నమోదు చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని హైదరాబాద్ అటారి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.వి.ఆర్. రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో బీసీటీ,కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మొక్కలు రకాలు, పరిరక్షణ, రైతులు హక్కుల చట్టం–2001 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పంటల వైవిధ్యం ఉన్పప్పటికీ పంటల రకాలు, విత్తన నమోదు చాలా తక్కువగా ఉందన్నారు. స్థానిక ఏడీఆర్ అప్పలస్వామి మాట్లాడుతూ విత్తనాలపై రైతులు హక్కులను కాపాడడమే కాకుండా అవసరమైతే రైతులు తరఫున పోరాడడానికి రైతుల చట్టం ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. రైతు క్లబ్బుల ఏర్పాటుకు ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు.ఈ సందర్భంగా సంజీవని స్వచ్ఛంద సంస్థ సంచాలకులు దేముళ్లు,బీవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్డి,డాక్టర్ బాలహుస్సేన్‌రెడ్డిలు పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బండి నాగేంద్ర ప్రసాద్,డాక్టర్ వాన ప్రసాదరావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.