భోగి మంటల్లో వీబీ–జీరామ్‌జీ జీవో ప్రతులు
శరబగుడలో వీబీ జీ రామ్‌జీ ప్రతులను భోగి మంటలో వేసి
దహనం చేస్తున్న సీపీఎం నాయకులు
వాంగెడ్డలో జీవో కాపీలను దహనం చేస్తున్నసీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్
అరకులోయటౌన్/చింతపల్లి/పాడేరు రూరల్: ఉపాధి హామీ పథకంలో మార్పులకు నిరసనగా పలు ప్రాంతాల్లో వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) జీవో ప్రతులను బుధవారం భోగిమంటల్లో వేసి, సీపీఎం, గిరిజన సంఘం నాయకులు దహనం చేశారు. అరకులోయ మండలంలోని శరభగుడలో జరిగిన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేదల హక్కు అని తెలిపారు. పనిదినాల పెంపుపేరుతో చట్టాన్ని మార్చినట్టు చెబుతున్నప్పటికీ వాస్తవంగా కూలీలకు 50 పనిదినాలు కూడా లభించడం లేదన్నారు. కనీస వేతనం రూ. 304 చెల్లించాల్సి ఉండగా రూ. 220 కూడా చెల్లించడం లేదని చెప్పారు. కేంద్రప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈనెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ‘ఇంటింటికీ ఉపాధి’ పేరిట సీపీఎం ప్రచారం చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల నాయకులు జగన్నాథం, హరి, రాము, గోపాల్, సహాదేవ్, పరశురాం, మోహన్, గోపి తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ వాంగెడ్డ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పథకానికి 90 శాతం నిధులు కేంద్రం,10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించేవని, ప్రస్తుతం కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాగిన చిరంజీవి, రామారావు, పెద్దబ్బాయి, సత్యవతి నారాయణ, అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ గుర్రగరువులో జరిగిన కార్యక్రమంలో సీపీఎం నేత, మోదపల్లి మాజీ సర్పంచ్ పాలికి లక్కు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ చర్యల వల్ల పేదలకు నష్టం జరుగుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు రాజు, బాలరాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
భోగి మంటల్లో వీబీ–జీరామ్‌జీ జీవో ప్రతులు
భోగి మంటల్లో వీబీ–జీరామ్‌జీ జీవో ప్రతులు


