అభివృద్ధి దూరం
ఆదాయం ఘనం...
డుంబ్రిగుడ: ఆంధ్ర కశ్మీర్ అరకులోయకు సమీపంలో గల చాపరాయి, అరకు పైనరీలకు సీజన్‌లో పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. రోజూ రెండు వేల నుంచి మూడు వేల మంది వరకూ ఈ ప్రాంతాలను సందర్శిస్తారు. అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తోంది. అయితే ఇక్కడ మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, సేదతీరేందుకు సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణనాతీతం. మండలంలోని పర్యాటక కేంద్రాలకు ఆదాయం భారీ ఎత్తున లభిస్తున్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది పొడవునా పెద్ద ఎత్తున వస్తున్న పర్యాటకుల నుంచి టికెట్ రూపంలో భారీ ఎత్తున ఆదాయం లభిస్తోంది. అయితే సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని టూరిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడేరు – అరకు జాతీయ రహదారికి అనుకుని మండల పరిధిలో ఉన్న చాపరాయి జలపాతాన్ని గత ఏడాది టూరిస్టులు పెద్ద ఎత్తున సందర్శించారు. జనవరి జనవరి 1 వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు టికెట్‌ల రూపంలో సుమారు రూ.1.06 కోట్ల ఆదాయం లభించినట్టు చాపరాయి నిర్వాహకుడు అప్పరావు తెలిపారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొల్లాపుట్టు కాటేజీలకు సూమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరకు పైనరీకి సుమారు రూ.80 లక్షల ఆదాయం వచ్చినట్టు అరకులోయ, డుంబ్రిగుడ మండలాల రేంజర్ కోటేశ్వరరావు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తున్నా సౌకర్యాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తోందని పర్యాటకులు వాపోతున్నారు.చాపరాయి వద్ద సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. చాపరాయిలో స్నానం చేసే ప్రాంతం వద్ద ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో తరచూ టూరిస్టులు జారిపడి గాయాలపాలవుతున్నారు. రెండేళ్ల కిందట చాపరాయి అభివృద్ధికి రూ.80 లక్షలు ఖర్చు చేశారు. అయితే పూర్తిస్థాయిలో సౌకర్యాలు క ల్పించలేదు. దీంతో ఆహ్లాదం కోసం వచ్చే పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికై న అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.
చాపరాయి, అరకు పైనరీ, కొల్లాపుట్టు కాటేజీలకు భారీగా ఆదాయం
చాపరాయికి రూ.1.06 కోట్లు
అరకు పైనరీకి రూ.80 లక్షల
కొల్లాపుట్టు ఐటీడీఏ కాటేజీల ద్వారా రూ.30 లక్షలు
సౌకర్యాలు శూన్యం
మహిళలకు తప్పని ఇబ్బందులు
అభివృద్ధి దూరం


