ఇంటికొచ్చి కొంటున్న మహారాష్ట్ర వ్యాపారులు
రైతులకు రవాణా, హమాలీ ఖర్చులు మిగులు
‘ఆదిలాబాద్’లో ఆగని తేమ కొర్రీలు
పైకి అధిక రేటు అంటూనే.. లోన కోతలు
బండ్లు రాక బోసిపోయిన యార్డు
ఇది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం ఉదయం పరిస్థితి. సాధారణంగా పత్తి కొనుగోళ్లు మొదలైన రెండో రోజు అక్కడ పత్తి బండ్లతో కళకళ లాడాలి. రైతుల రాకతో సందడి కనిపించాలి. ప్రారంభమైన మొదటిరోజు ఆ పరిస్థితి లేదు.. రెండో రోజు సైతం కేవలం 43 బండ్లు వచ్చాయి. 768 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. సాధారణంగా మొదట్లో వందలాది వాహనాలు, వేల క్వింటాళ్లలో మార్కెట్‌కు ప్రతి సీజన్ వస్తుంది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
తాంసి మండలం వడ్డాడికి చెందిన ఓ రైతుకు 21 క్వింటాళ్ల పత్తి దిగుబడి చేతికి అందింది. గురువారం మహారాష్ట్రకు చెందిన వ్యాపారి అతడి ఇంటి వద్దకే వచ్చాడు. క్వింటాలుకు రూ.9,100 చొప్పున చెల్లిస్తూ జాగ మీదే పత్తి కొనేశాడు. మహారాష్ట్రకు తీసుకెళ్లాడు. ఇక్కడ ఈ రైతుకు పత్తి నింపేందుకు కూలీల బెడద, ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చు తప్పింది. మంచి ధర చేతికందింది. తలమడుగు మండలంలోని కజ్జర్ల, రుయ్యాడి గ్రామాల్లోనూ పలువురు రైతులు ఇలాగే మహారాష్ట్ర వ్యాపారులకే ఇప్పటికే పంటను అమ్మేశారు.
సాక్షి,ఆదిలాబాద్: ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది వానకాలంలో సాగు చేసిన పత్తి పంటకు ఆశించిన స్థాయిలో దిగుబడులు లేవని రైతు ఆవేదన చెందుతున్నాడు. చేతికందిన అంతో.. ఇంతో పత్తిని ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిద్దామంటే ఇక్కడ వ్యాపారులు పైకి అత్యధిక ధర ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, లోనికి వెళ్లగానే తేమ కొర్రీ పెట్టి ధర అమాంతం తగ్గిస్తున్నారు. కూలీలకు డబ్బులు చెల్లించి పత్తిని అద్దె వాహనంలో నింపుకొని ఊరి నుంచి ఆదిలాబాద్ మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు కనీసంగా రూ.3,500 నుంచి రూ.4వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి వస్తున్న వ్యాపారులు రైతుకు ఆదిలాబాద్ మార్కెట్లో పైకి చెబుతున్న పత్తి ధరను జాగ మీదికొచ్చి చెల్లిస్తున్నారు. తేమ కొర్రీ లేకుండా ఉన్న పత్తిని రైతు దగ్గరి నుంచి కొనుగోలు చేసేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది అటువైపే మొగ్గు చూపుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ మార్కెట్లో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.8,667 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు వేలంలో క్వింటాలుకు రూ.9,260 చెల్లించేందుకు ఒప్పుకున్నారు. రాష్ట్రంలో మన దగ్గరే అత్యధిక రేటు అంటూ గొప్పలు పోయారు. తీరా ఈ రెండు రోజుల్లో పత్తిని అమ్మిన కొద్ది మంది రైతుల్లోనే 40 శాతం మందికి ప్రైవేట్‌లో ప్రకటించిన ధర దక్కలేదు. తేమ కొర్రీ పెట్టి ప్రతి క్వింటాలుకు ధర తగ్గించి రైతులకు చెల్లించారు. మొదటి నుంచి ఈ మార్కెట్లో పరిస్థితిని ఎదుర్కొంటున్న పత్తి రైతులు ప్రస్తతం అప్రమత్తమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి ధర లభిస్తే కనీసం పెట్టుబడులైనా దక్కుతాయని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర వ్యాపారులు తమ వద్దకే వచ్చి పత్తిని కొనుగోలు చేస్తుండడంతో ఎలాంటి సందేహం లేకుండా విక్రయించేస్తున్నారు.
ఆదిలాబాద్ మార్కెట్‌లో రెండు రోజుల కొనుగోళ్లు.. (గురు, శుక్రవారాల్లో)
పత్తి అమ్మిన రైతులు 118
విక్రయించిన దిగుబడి 2,092 క్వింటాళ్లు
8 శాతం తేమతో రూ.9,260 ధర పొందినవారు : 79 (1414 క్వింటాళ్లు)
9 శాతంతో రూ.9,167 ధర పొందినవారు : 29 (523 క్వింటాళ్లు
10 శాతంతో రూ.9,075 ధర పొందినవారు : 08 (138 క్వింటాళ్లు)
11 శాతంతో రూ.8,982 ధర పొందినవారు : 01 (8 క్వింటాళ్లు)
12 శాతంతో రూ.8,890 ధర పొందినవారు : 01 (7 క్వింటాళ్లు)


