ఆదిలాబాద్‌టౌన్: వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు సమ్మెబాట పట్టా రు. తమ డిమాండ్లు నెరవేర్చాలని విధులు బహిష్కరించి రోజుకో తీరు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె, బస్తీ దవాఖానాలు, వైద్యారోగ్య శాఖ కార్యాలయంతో పాటు ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలో ఈనెల 13 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్న విషయం తె లిసిందే. ఈ క్రమంలో వైద్య సిబ్బంది లేక డీఎంహెచ్‌వో కార్యాలయంతో పాటు ఆస్పత్రులు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు సమ్మెకొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వీరి ఆందోళన కారణంగా రోగులకు అవస్థలు తప్పడం లేదు.
సమ్మెలో 478 మంది ఉద్యోగులు..
జిల్లాలో 22 పీహెచ్‌సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులున్నాయి. రిమ్స్‌లో సైతం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 478మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. 78 రకాల క్యాడర్లలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో డేటాఎంట్రీ ఆపరేటర్లు, ప్రో గ్రాం అధికారులు, బస్తీ, పల్లె దవాఖానా, ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో 2వ ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులు, ఎంఎల్‌హెచ్‌పీలుగా, ఆర్‌బీఎస్ కేలో డీఐఈసీసెంటర్‌లో,టీ–హబ్, ఎస్‌ఎన్‌సీయూ, టీబీ సెంటర్‌లలో పనిచేస్తున్నారు. వీరు సమ్మె చేపట్టడంతో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. రోగులకు రక్త పరీక్షలు, మందులు, చిన్నారులకు ఇమ్యూనైజేషన్, ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తులకు మందులు సరఫ రా వంటి తదితర పనులకు సైతం బ్రేక్ పడింది.
వినూత్న నిరసనలు..
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 11 రోజులుగా సమ్మె చేపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ భిక్షాటన, ఒంటి కాలు, మోకాళ్లపై నిలబడటం, ఉపవాస దీక్ష, నల్లబ్యాడ్జీలు ధరించడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
డిమాండ్లు ఇవే..
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం చె ల్లించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. 2022 నుంచి ఇప్పటివరకు ఉద్యోగులకు రావాల్సిన 5 శాతం పెంచిన వేతనం చెల్లించాలి. విధి నిర్వహణలో మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు బాధి త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు రద్దు చేసి స్పర్శ్ ద్వారా వేతనాలు చెల్లించాలి.


