ఉట్నూర్‌రూరల్: పాత ఉట్నూర్‌కు చెందిన రిటైర్ ఉపాధ్యాయుడు మడావి లక్ష్మణ్–కమలాబాయి దంపతులకు ఐదుగురు కూతుళ్లు. అందరూ ఆడపిల్లలైనా ఏ రోజు బాధపడలేదని, భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి వారికి మంచి విద్య అందించి ప్రయోజకులను తీర్చిదద్దానని అంటున్నాడు లక్ష్మణ్. ఇప్పటి వరకు నలుగురు బిడ్డలకు వివాహాలు చేశానని, ప్రస్తుతం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని సంతోషంగా చెబుతున్నాడు. అమ్మాయిలైనా మగపిల్లలతో సమానంగా చూస్తే కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తెస్తారని అంటున్నాడు ఈయన.
కుమార్తెల ప్రస్థానం..
కవిత (రెండో కుమార్తె): ఉపాధ్యాయురాలిగా ఎంపికై ప్రస్తుతం జైనూర్ మండలం జెండాగూడ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు.
దివ్య (మూడో కుమార్తె): అక్కతో పాటే ఒకేసారి ఉద్యోగం సాధించి ప్రస్తుతం అదే పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం విశేషం.
కళ్యాణి (నాలుగో కుమార్తె): ఈమె కూడా ఉపాధ్యాయ కొలువు సాధించి సిరికొండ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.
కృష్ణప్రియ (ఐదో కుమార్తె): ఇది వరకే డీఎస్సీ రాసిన ఈమె కొద్ది మార్కుల తేడాతో కొలువు చేజారినప్పటికీ పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే టీచర్ కొలువు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువు చదువాలనుకుంటోంది. వారి లాగే విజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది.
ఐదుగురు కూతుళ్లు..
ముగ్గురికి సర్కారు కొలువులే


