ఆదిలాబాద్: పట్టణంలో శనివారం వేకువజామున గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల వైఖరి నిరసిస్తూ మండపాల నిర్వాహకులు విగ్రహ వాహనాలను నిలిపివేసి అంబేడ్కర్ చౌక్‌లో బైఠాయించారు. ఎమ్మెల్యే శంకర్ తనయుడు శరత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిమజ్జనం త్వరగా పూర్తి చేయాలంటూ పోలీసులు ఒత్తిడి తెచ్చారని, అశోక్ రోడ్డులో విద్యుత్ దీపాలు ఆర్పి బెదిరించారని, ట్రాక్టర్ డ్రైవర్ల ఫోన్లు తీసుకున్నారని నిర్వాహకులు ఆరోపించారు. కొన్ని డీజేలు, బ్యాండ్లను పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి నిర్వాహకులను సముదాయించినా ఆందోళన కొనసాగింది. సుమారుగా ఐదు గంటల పాటు శోభాయాత్ర నిలిచిపోయింది. అనంతరం కలెక్టర్ రాజర్షి షా చేరుకుని ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పేర్కొన్నారు.


