ఆడపిల్ల అంటే భారమనే రోజులు పోయాయి. కట్టుబాట్లు క్రమంగా కరిగిపోయాయి. ప్రస్తుతం ఆకాశంలో సగం.. అవనిలో సగం అనేలా రాణిస్తున్నారు అతివలు. పాలనలో పాలుపంచుకుంటూ.. విద్య, వైద్య రంగాల్లో సత్తా చాటుతున్నారు. దేశసేవలోనూ భాగస్వాములవుతున్నారు. ఇంటి మహాలక్ష్ములుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు సైతం తమకు భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తున్నారు. కూతుళ్లనే కొడుకులుగా భావించి ఉన్నతంగా తీర్చిదిద్దిన వారు జిల్లాలో ఎందరో ఉన్నారు. నేడు డాటర్స్ డే సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనం.
బోథ్: కూతురు పుట్టిందంటే బాధ్యతగా కాకుండా భవి ష్యత్తుగా చూడాలి. ఆమెకు చదువు, ప్రోత్సాహం అందిస్తే కుటుంబంతో పాటు పుట్టిన ప్రాంతానికే గర్వకారణంగా నిలుస్తున్నారు సరస్వతి, మీనాక్షి. బోథ్ మండలం రాంనగర్‌కు చెందిన హుషార్‌సింగ్–శిలాబాయి దంపతుల కుమార్తె మీనాక్షి, అదే గ్రామానికి చెందిన నత్తు సింగ్–నేషియాబాయి దంపతుల కుమార్తె సరస్వతి కష్టపడి చదివి సైన్యంలో కొలువు సాధించారు. ఈ ఇద్దరు ప్రస్తుతం బీఎస్‌ఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తమ కూతుళ్లు దేశ రక్షణలో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ఉందని అంటున్నారు ఇరువురి తల్లిదండ్రులు.
సరస్వతి, తండ్రి నత్తు సింగ్, తల్లి నే షియా బాయి
మీనాక్షి, తండ్రి హుషార్ సింగ్, తల్లి శిలాబాయి


