ఆదిలాబాద్‌టౌన్: కొత్త టెండర్లు ఖరారయ్యే వరకు రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు చెల్లించే బాధ్యతను కలెక్టర్ ద్వారా కొనసాగించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేందర్ డిమాండ్ చేశారు. రిమ్స్ ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నల్ల శివన్న అధ్యక్షతన శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 నెలలుగా రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో శా నిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల కాంట్రాక్ట్ ఏజెన్సీ కృష్ణా కన్‌స్ట్రక్షన్‌ను కలెక్టర్ రాజర్షి షా రద్దు చేశారని, అప్పటి నుంచి కలెక్టర్ ప్రత్యేక చొరవతో మెప్మా ద్వారా కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. 20 రోజులుగా కొత్త కాంట్రాక్టర్ వచ్చారని, కేవలం రూ.11వేల వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ రూ.800 నుంచి 1000 ఇస్తామని చెబుతూ బయోడేటాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా కొత్త ఏజెన్సీని ఖరారు చేసే వ రకు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ప్రతి నెల 1వ తేదీలోగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముజీబ్, లక్ష్మి, సంగీత, ఇర్ఫాన్ ఖాన్, అమీర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.


