ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ప్రమాద ఘటన పునరావృతం కాకుండా వైద్యులు, సిబ్బంది సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి వైద్యులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో ప్రాణనష్టం పెరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం రిమ్స్ ఆవరణలోని మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ఔషధాల కొనుగోలుకు వచ్చిన రోగుల సహాయకులతో మాట్లాడారు. మందులు ఎందుకు కొనాల్సి వస్తోందనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పసికందుల మరణాలు రిమ్స్ చరిత్రలోనే దుర్ఘటనగా నిలిచాయన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. సీఎంతో జరిగే సమీక్షలో రిమ్స్ సమస్యలను ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


