ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గిన్నేర గ్రామాన్ని సందర్శించి రిమ్స్ ఘటనలో మృతి చెందిన శిశువు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రిమ్స్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పసి ప్రాణాలు గాల్లో కలిశాయని ఆరోపించారు. అనంతరం మండలంలోని ముత్నూర్ గ్రామాన్ని సందర్శించి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంటాల్వార్ గణేశ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఏమాయికుంట గ్రామాన్ని సందర్శించి విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన పవార్ వికాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బీజేపీ మండలాధ్యక్షుడు కేంద్రే బాలాజీ, అసెంబ్లీ కో కన్వీనర్ ఆరెల్లి రాజలింగు, నాయకులు దీపక్‌సింగ్ షెకావత్, శివకుమార్‌జైస్వాల్, కనక హనుమంత్‌రావ్ తదితరులున్నారు.


