లక్ష్మణచాంద: నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ దిశగా సంపూర్ణ అక్షరాస్యతను లక్ష్యంగా పెట్టుకుని ‘ఉల్లాస్’ (అండర్‌స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) ఆధ్వర్యంలోని డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యుల సహకారంతో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నారు. అదే సమయంలో 6, 7 తరగతుల్లో చదువు మధ్యలో ఆపేసిన వారిని కూడా ఈ కార్యక్రమంలో చేర్చి మళ్లీ చదువుకునేలా కృషి చేస్తున్నారు.
గత లక్ష్యం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,12,213 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యం నిర్ణయించారు. ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో అక్షరాలు, చదవడం, రాయడం నేర్పించే తరగతులు నిర్వహించారు. గత మార్చి 29న పరీక్ష నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 58,666 మంది హాజరయ్యారు. వీరిలో 50,942 మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రస్తుత లక్ష్యం..
గత పరీక్షకు హాజరుకాని వారు, ఉత్తీర్ణులు కాని వారికోసం నేడు (ఆదివారం) రెండో విడత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రస్తుత లక్ష్యం 61,271. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యాసకుల పేర్లు, వివరాలను ముందుగా రిసోర్స్ పర్సన్, మహిళా సంఘ సభ్యులకు అందజేస్తే రిజిస్ట్రేషన్ ఫారంలో నమోదు చేస్తారు. ఈ ఫారమే హాల్‌టికెట్‌గా పనిచేస్తుంది.
గ్రామ పంచాయతీలో లేదా అనుకూలమైన ప్రదేశంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం లేదా ఉపాధ్యాయుడిని పర్యవేక్షకుడిగా నియమించారు. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు, పెన్నులు తదితర సామగ్రిని సంబంధిత ఏపీఎంలు అందజేస్తారు.
ఏర్పాట్లు పూర్తి
గ్రామాల్లో విద్యా శాఖ, గ్రామాణాభివృద్ధి శాఖ, వయోజన విద్య, మెప్మా శాఖల సమన్వయంతో పరీక్ష నిర్వహిస్తున్నాం. వంద శాతం హాజరు అయ్యేలాగా జిల్లాలో ఉల్లాస్ పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.
– భోజన్న, డీఈవో, నిర్మల్


