ఒత్తిడి లేని విద్య.. ప్రాథమికస్థాయి నుంచి ఆటలు | - | Sakshi
Sakshi News home page

ఒత్తిడి లేని విద్య.. ప్రాథమికస్థాయి నుంచి ఆటలు

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

● జపాన్‌ విద్యావిధానంపై ఉపాధ్యాయురాలు వనజ అనుభవాలు

మామడ: మామడ మండలం దిమ్మదుర్తి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు వనజ ఇటీవల విదేశీ వివ్య అధ్యయనం కోసం జపాన్‌కు వెళ్లి వచ్చారు. అక్కడి పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తాను గమనించిన అంశాలను ఆమె వివరించారు. ‘విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రెగ్యులర్‌ పీరియడ్‌లతోపాటు ఆటలకు ప్రత్యేక పీరియడ్‌ కేటాయించి ఆడిస్తారు. చదువుతో ఒత్తిడి లేకుండా చూస్తారు. మాతృభాషలోనే బోధన జరుగుతోంది. విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించరు’ అని చెప్పారు.

కృత్యాల ద్వారా నేర్చుకోవడమే..

‘తరగతి గదులు విశాలంగా ఉంటాయి. పాఠ్యాంశాలకు సంబంధించిన కృత్యాలను ఉపాధ్యాయులు గది నిండా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి. కృత్యాలతో ఆడుకుంటూ వాటి ఆధారంగా అనేక అంశాలను నేర్చుకుంటారు. 10 నుంచి 12 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ఒక సహాయ ఉపాధ్యాయుడు ఉంటారు’ అని వివరించారు.

ప్రత్యేకావసరాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

‘ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. నలుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ఒక అసిస్టెంట్‌ ఉపాధ్యాయుడు బోధన చేస్తారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

క్రమశిక్షణ, పరిశుభ్రత, విలువలు

‘పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు క్రమశిక్షణ, పరిశుభ్రత, దేశభక్తి, ఇతరులను గౌరవించడం తదితర విలువలను నేర్పుతున్నారు. దీంతో విద్యార్థులు చిన్నప్పటి నుంచే వాటిని పాటిస్తున్నారు. పాఠశాల సమయం ఉదయం 8.50 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. పాఠశాలపై ప్రజల్లో అధిక బాధ్యత కనిపించింది. విద్యార్థులు అసైన్‌మెంట్‌లను తమ వద్ద ఉన్న ట్యాబ్‌ల సాయంతో చేస్తున్నారు’ అని తెలిపారు.

వస్తువులకు భద్రత

‘జపాన్‌ విద్యా వ్యవస్థ అధ్యయనం కోసం వెళ్లిన బృందంలోని ఒక ఉపాధ్యాయుడు మొబైల్‌ ఫోన్‌ అక్కడ మరిచిపోయారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మొబైల్‌ను సంబంధిత ఉపాధ్యాయుడికి పంపించారు’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement