నేరడిగొండ: ఉద్యోగ, విద్య, వ్యాపారం నిమిత్తం విదేశాల్లో స్థిరపడిన సోదరులకు రాఖీలు పంపించేందుకు తపాలా శాఖ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ఐటీపీఎస్) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాలకు రాఖీలను పంపించే వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ కొరియర్ కంటే తక్కువ ఖర్చుతో ఈ సేవ అందుబాటులో ఉండటంతో సోదరసోదరీమణులు తమ అనుబంధాన్ని సరిహద్దులు దాటి చాటుకునే అవకాశం లభిస్తోంది.
3 నుంచి 12 రోజుల్లో చేరేలా..
రాఖీ పార్శిళ్లను కార్గో విమానాల ద్వారా విదేశాలకు సురక్షితంగా తరలిస్తారు. బుకింగ్ చేసిన తర్వాత ప్యాకెట్ ఎక్కడ ఉందో ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉంది. సాధారణంగా మూడు నుంచి 12 రోజుల్లో గమ్యస్థానానికి చేరుతుందని తపాలా అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆయా దేశాలకు బరువును బట్టి చార్జీలు వసూలు చేయనున్నారు. ఆయా దేశాలను బట్టి పార్సిల్ బరువు 2 కిలోల నుంచి 5 కిలోల వరకు ఉండవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
విదేశాల్లో ఉన్న సోదరులకు రాఖీలు పంపాలనుకునే వారు తపాలా శాఖ అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సేవలు, చార్జీలు, బుకింగ్, తదితర వివరాల కోసం సమీపంలోని తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలి.
– రాకేష్ కుమార్, సబ్ పోస్ట్‌మాస్టర్, నేరడిగొండ
135 దేశాలకు రాఖీలు పంపేలా..
తపాలా శాఖకు చెందిన ఐటీపీఎస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 135 దేశాలకు రాఖీలను పంపించవచ్చు. ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.


