ఆదిలాబాద్: ప్రపంచ జానపద దినోత్సవ సంబురాల్లో స్థానిక బాలకేంద్రం చిన్నారులు పాల్గొని తమ నృత్య ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని సింగరేణి కళావేదికలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో బోనాల పాటలకు చిన్నారులు అద్భుతంగా నృత్య ప్రదర్శన చేసి అలరించారు. ఇందులో కే.జాహ్నవి, కే.సహస్ర, జి.శ్రీనిధి, కే.కృతిక, కే.వంశిక, శ్రీచైత్ర, ఎం.మహాశ్విని, కే.అనన్య,కే. ఆయుషి, పి.ధన్విక, పి.శ్రీయాన్షి, వి.శ్రేష్ట, కే.లాస్య, బ్రాహ్మణి తదితరులున్నారు. వీరంతా ఈ నెల 31న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే జానపద సంబరాల ముగింపు వేడుకల్లో పాల్గొననున్నట్లు నృత్య శిక్షకుడు మిట్టు రవి తెలిపారు. అనంతరం చిన్నారులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


