సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆదిలాబాద్ జిల్లాకే తలమానికమైన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను వెంటనే తెరిపించాలని, అందుకోసం జరిగే ఉద్యమానికి తెలంగాణ జన సమితి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ పునరుద్ధరణకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రొఫెసర్ కే.నాగేశ్వర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు, వనరులు, ఇతర ప్రాంతాలతో పోల్చితే అతిచౌకగా ఇక్కడ ఉత్పత్తి చేయవచ్చని అన్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ పరిశ్రమను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునరుద్ధరణకు నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. తాముఽ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించడానికి సిద్ధమని, కొత్త పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్‌షా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపిస్తే సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఇప్పటికై నా పరిశ్రమ తెరిపించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ చంద్రకుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్, చలపతిరావు, నందిరామయ్య, నాగరాజు, గుడిసె రూబీీస్టీవెన్‌సన్ తదితరులు పాల్గొన్నారు.


