ప్రతీ బొట్టు.. ఒడిసిపట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రతీ బొట్టు.. ఒడిసిపట్టు

Jul 29 2026 12:40 AM | Updated on Jul 29 2026 12:40 AM

జలసిరి పెంచేలా.. నీటి కరువు ఎదుర్కొనేలా వర్షపునీటిని ఒడిసిపట్టడమే లక్ష్యం వీబీ–జీరాంజీ పథకం కింద ప్రత్యేక నిర్మాణాలు

వర్షపునీటిని ఒడిసిపట్టేలా..

కై లాస్‌నగర్‌: ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో సమృద్ధిగా వానలు కురువడం లేదు. జూలై నెలాఖరుకు చేరినా జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే ఉంది. ఈ క్రమంలో తాగు, సాగు నీటి ఇక్కట్లు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టాలనే లక్ష్యంతో జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15నాటికి జిల్లా వ్యాప్తంగా నీటి సంరక్షణకు అవసరమైన నిర్మాణాలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించింది. తదనుగుణంగా కార్యాచరణను సిద్ధం చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యాలను సాధించే దిశగా కసరత్తు చేస్తోంది.

ప్రత్యేక కార్యాచరణ..

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యాచణ సిద్ధం చేసింది. జిల్లాకు 500 ఫాంపాండ్స్‌ నిర్మాణ లక్ష్యంగా నిర్దేశించగా వాటిని సాధించే దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. పంద్రాగస్టు వరకు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో రెండింటిని తప్పనిసరిగా నిర్మించాలని భావిస్తోంది. లక్ష్యాన్ని సాధించే దిశగా ఆసక్తి గల రైతులతో పాటు శాఖాపరంగా వ్యవసాయ భూమి కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రత్యేకంగా గుర్తించారు. ఇందులో ఆసక్తిగల వారిని ఎంపిక చేయడంతో పాటు ఏ సైజ్‌లో వాటిని నిర్మించాలనే అంచనాలు సిద్ధం చేస్తున్నారు. నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. మూడు సైజ్‌ల్లో ఫాంపాండ్స్‌ను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. సైజ్‌ల ఆధారంగా రూ.80వేల నుంచి రూ.3.50లక్షల వరకు చెల్లించనున్నారు. అలాగే ఇళ్లలో ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి రూ.6800 అందజేస్తారు. ఇళ్లలోనే కాకుండా సామాజిక నీటి వనరులున్న ప్రాంతాల్లోనూ కమ్యూనిటీ ఇంకుడుగుంతలను శాఖా పరంగానూ నిర్మించనున్నారు. ఇందుకోసం స్థలాలను ఎంపిక చేసే బాద్యతలను ఎంపీడీవో, తహసీల్దార్లకు అప్పగించారు. వీటితో పాటు భూగర్భజలాలు అడుగంటిన బోరుబావులు, చేతిపంపుల వద్ద వర్షపునీరు వృథా పోకుండా నేరుగా భూమిలోకి చేరి నీటిమట్టం పెరిగేలా బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకోసం ఒక్కోదానికి రూ.35వేలు చెల్లించనున్నారు.

ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టడమే లక్ష్యంగా ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే పంట పొలాల్లో వర్షపునీటిని సంరక్షిస్తూ సాగుకు వినియోగించుకునేలా నీటి కుంటలు (ఫాంపాండ్స్‌), నీరు అడుగంటిన బోర్‌ బావులు, చేతి పంపుల వద్ద రీచార్జ్‌ నిర్మాణాలతో పాటు గ్రామాల్లో నీటి కరువు ఏర్పడకుండా ఉండేలా చిన్నపాటి చెరువు (ఊటకుంట)లను నిర్మించనున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధితో పాటు నీటి సంరక్షణకు తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, అజీవిక మిషన్‌ (వీబీ–జీరాంజీ ) పథకం కింద ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు. ఆగస్టు 15వరకు లక్ష్యాలను నిర్దేశించిన రాష్ట్ర ప్రభుత్వం గడువులోపు పూర్తి చేసిన అధికారులను సీఎం చేతుల మీదుగా సన్మానించనున్నట్లుగా స్పష్టం చేసింది. ఆ దిశగా యంత్రాంగం చర్యలు చేపడుతుంది.

జిల్లాలోని

గ్రామ పంచాయతీలు : 473

ప్రభుత్వం నిర్దేశించిన ఫాంపౌండ్స్‌ లక్ష్యం : 500

డీఆర్‌డీఏ గుర్తించిన ఎస్‌హెచ్‌జీ

సభ్యులు : 5,362

బోర్‌వెల్‌ రీచార్జి స్ట్రక్చర్స్‌

నిర్మాణాల లక్ష్యం : 6,270

ఊట కుంటల లక్ష్యం : గ్రామానికి ఒకటి

కసరత్తు చేస్తున్నాం

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను సాధించేదిశగా కసరత్తు చేస్తున్నాం. తొలుత ఫాంపాండ్స్‌ నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మాణాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములవ్వాలి.

– రాంప్రసాద్‌, అదనపు డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement