హమ్మయ్య.. జొన్నలమ్మినం | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. జొన్నలమ్మినం

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

● ముగిసిన యాసంగి కొనుగోళ్లు ● ఈ సారి వెంటాడిన అసౌకర్యాలు ● త్వరగా డబ్బులు జమచేయాలంటున్న రైతులు

కై లాస్‌నగర్‌: జిల్లాలో యాసంగి సీజన్‌ జొన్నల కొనుగోళ్లు సోమవారంతో ముగిశాయి. ఈ సారి కేంద్రాల్లో అసౌకర్యాలు వెంటాడగా.. రైతుల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 26 పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి ప్రక్రియ పూర్తి చేసినా విక్రయించిన రైతుల ఖాతాల్లో మాత్రం నగదు జమ చేయలేదు. దీంతో ఖరీఫ్‌ పెట్టుబడి కోసం వారికి తిప్పలు తప్పని పరిస్థితి.

పెరిగిన దిగుబడి

జిల్లాలో రైతులు ఈ సారి పెద్ద మొత్తంలోనే జొన్న సాగు చేశారు. దిగుబడి సైతం పెరిగింది. ఎకరాకు 25నుంచి 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. అయితే పంట విక్రయించుకునేందుకు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిగుబడి చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళనలు చేపట్టాల్సి వచ్చింది. స్పందించిన ప్రభుత్వం కేంద్రాలను ఆలస్యంగా షురూ చేసింది. హమాలీలను పూర్తి స్థాయిలో నియమించలేదు. లారీల కొరత తోడవడంతో కాంటా పూర్తయినా గోదాంలకు సకాలంలో తరలించలేని పరిస్థితి. ఫలితంగా రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. నిల్వలు పేరుకుపోయాయనే కారణంతో పలు చోట్ల రెండు రోజులు కొంటే మరో రెండు రోజులు కొనుగోళ్లకు బ్రేక్‌ వేశారు. గన్నీసంచుల కొరత సైతం రైతులకు శాపంగా మారింది.

ఈ సారి కేంద్రాలను పెంచినా..

కొనుగోళ్లు వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈసారి కేంద్రాలను పెంచింది. ఈ ఏడాది కజ్జర్ల, భీంపూర్‌, పిప్పర్‌వాడ, బేల, మేడిగూడ, ఝరి, మర్లపల్లి, తడిహత్నూర్‌, శ్యాంపూర్‌ గ్రామాల్లో అదనంగా ఏర్పాటు చేసింది. అయితే రైతుల సంఖ్యకనుగుణంగా వసతులు కల్పించలేదు. కాంటాలు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడం, సరిపడా హమాలీలు అందుబాటులో లేక కొనుగోళ్లు ఆలస్యం కావడమే కాకుండా తరలింపులోనూ జాప్యం ఏర్పడింది. పంట కొన్న తర్వాత వారం వరకు తక్‌పట్టీలు ఇవ్వకపోవడంతో రైతులు కేంద్రాల్లోనే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

పెట్టుబడి సాయానికి పడిగాపులే..

జిల్లా వ్యాప్తంగా రూ.257 కోట్ల 16లక్షల 83వేల 512 విలువైన 6,95,237 క్వింటాళ్ల జొన్నలను పీఏసీఎస్‌ల ద్వారా మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఇందులో 5,35,895 క్వింటాళ్లను గోడౌన్లకు తరలించింది. ఈ తరలింపులో జాప్యం కారణంగా పలు యార్డులు జొన్న రాశులతో నిండిపోయాయి. ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, తలమడుగు, నేరడిగొండ మార్కెట్‌యార్డుల్లో వేలాది జొన్నల బ్యాగులు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకా 1,59,342 క్వింటాళ్ల నిల్వలను గోడౌన్లకు తరలించాల్సి ఉంది. సోమవారం ఉదయం నుంచి పలు చోట్ల వర్షం కురుస్తుండటంతో జొన్నలు తడిసిపోయే అవకాశముంది. కాగా పంట విక్రయించిన రైతుల ఖాతాల్లో నగదు మాత్రం జమకాలేదు. దీంతో వానాకాలం పెట్టుబడి కోసం దళారుల వద్ద అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

జిల్లాలో జొన్నల కొనుగోళ్ల వివరాలు..

మొత్తం కొనుగోలు కేంద్రాలు 26

ఇప్పటి వరకు కొనుగోలు చేసింది

69,523 మెట్రిక్‌ టన్నులు

విక్రయించిన రైతులు 24,068

యార్డుల్లో నిల్వ ఉన్న జొన్నలు

15,934 క్వింటాళ్లు

Advertisement
 
Advertisement
Advertisement