● కూలేందుకు సిద్ధంగా 135 ప్రభుత్వ పాఠశాలల భవనాలు ● విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన ● త్వరలోనే పునఃప్రారంభం కానున్న పాఠశాలలు ● వర్షాకాలం కావడంతో అప్రమత్తమైన విద్యాశాఖ
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. అమ్మ ఆదర్శ, మన ఊరు–మనబడి ద్వారా మంజూరైన పలు పాఠశాల భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను చెట్ల కింద, పాఠశాల ఆవరణలో కూర్చోబెట్టి విద్యాబోధన సాగిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రెండు మూడు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అర్థంకాని పరిస్థితి. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభం కానుంది. జూన్ 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బడులు ప్రారంభం కాకముందే మరమ్మతులు చేపట్టడం, కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను తొలగిస్తే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
భయం గుప్పిట్లో..
జిల్లాలో డీఈవో పరిధిలో 739 పాఠశాలలున్నాయి. ఇందులో 500 ప్రాథమిక, 119 ప్రాథమికోన్నత, 120 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ బడుల్లో 57,896 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 135 బడుల్లో గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అనధికారికంగా 150 వరకు ఉండవచ్చు. ఏటా శిథిల భవనాల్లోనే విద్యార్థులకు చదువులు చెబుతుండడంతో వారు భయం గుప్పిట గడుపుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందోనని తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కానుండడంతో వానలకు గోడలు తడిసి, పైకప్పు కూలే అవకాశాలు లేకపోలేదు.
శిథిలావస్థలో 135 భవనాలు..
జిల్లాలో 135 పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదులు ఉన్నాయి. వీటిలో భీంపూర్ మండలంలో 4, భోరజ్‌లో 10, జైనథ్‌లో 9, సాత్నాలలో 4, బేలలో 6, గాదిగూడలో 3, నార్నూర్‌లో 6, ఇంద్రవెల్లిలో 15, గుడిహత్నూర్‌లో 9, ఆదిలాబాద్‌రూరల్‌లో 1, ఆదిలాబాద్‌అర్బన్‌లో 8, తాంసిలో 3, తలమడుగులో 10, బజార్‌హత్నూర్‌లో 3, సొనాలలో 1, బోథ్‌లో 6, నేరడిగొండలో 9, ఇచ్చోడలో 10, ఉట్నూర్‌లో 18 గదులు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి.
గుర్తించాం.. ఆదేశాలు జారీ చేశాం
జిల్లాలోని ఆయా పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను ఇప్పటికే గుర్తించాం. వాటిని తొలగించాలని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. మరమ్మతుల కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. ఇప్పటికే నిర్మాణాల్లో ఉన్న వాటిని బడులు తెరిచే నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.
– డి.మాధవి, డీఈవో
జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో భవనా లు శిథిలావస్థకు చేరడంతో కొంత మంది గు రువులు విద్యార్థులకు చెట్ల కింద, ఆరుబయటనే తరగతులు బోధిస్తున్నారు. వర్షాలు ప డిన సమయంలో విద్యార్థులందరినీ ఒకేచోట కూర్చోబెట్టడంతో వారి చదువులకు ఆటంకం ఎదురవుతుంది. అమ్మ ఆదర్శ, మన ఊరు–మనబడి ద్వారా పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది కూడా
విద్యార్థులకు అవస్థలు తప్పకపోవచ్చు.


