మండిన ‘గ్యాస్‌’ | - | Sakshi
Sakshi News home page

మండిన ‘గ్యాస్‌’

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

● డొమెస్టిక్‌పై రూ.29 పెంపు ● జిల్లాలో ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1,021 ● లబోదిబోమంటున్న పేదలు

కై లాస్‌నగర్‌: వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి మార్కు దాటింది. ఇప్పటికే పెట్రో ధరలను పెంచిన ఆయిల్‌ కంపెనీలు తాజాగా గృహావసర సిలిండర్‌ ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి. 14.2 కిలోల సిలిండర్‌పై రూ.29 పెంపుదలను ఆదివారం నుంచే అమల్లోకి తెచ్చాయి. దీంతో జిల్లాలో ఈ సిలిండర్‌ ధర రూ.1,021 చేరింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన సబ్సిడీలు సైతం నిలిచిపోవడంతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

గుదిబండగా గ్యాస్‌బండ..

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వంటింటిని తాకుతుంది. ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.60 బాదిన ఆయిల్‌ కంపెనీలు తాజాగా మరో రూ.29 పెంచడంతో సిలిండర్‌ ధర ప్రస్తుతం రూ.వెయ్యి మార్కు దాటిపోయింది. ఇప్పటికే పెరిగిన పెట్రో ధరల కారణంగా నిత్యాసరాల ధరలు ఆకాశన్నంటాయి. తాజాగా గ్యాస్‌ ధరపెంపుతో పేద, మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,05,250 వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున నెలకు ఒక సిలిండర్‌ చొప్పున వినియోగించినా జిల్లా వినియోగదారులపై ప్రతీనెల దాదాపు రూ.60 లక్షల వరకు అదనపు భారం పడనుంది.

ఉజ్వల, దీపం లబ్ధిదారులకు సైతం వర్తింపు..

ఇది వరకు వంట గ్యాస్‌ సిలిండర్ల ధర పెంపును కేంద్ర ప్రభుత్వం కేవలం సాధారణ గ్యాస్‌ కనెక్షన్‌ దారులకు మాత్రమే పరిమితం చేసేది. తాజాగా పెంచిన ధరను ఉజ్వల, దీపం గ్యాస్‌ కనెక్షన్‌ లబ్ధిదారులకు సైతం వర్తింపజేస్తోంది. కేంద్రం ఈ కనెక్షన్లన్నీ నిరుపేదలకే మంజూరు చేసింది. వాటికి రూ.300 సబ్సిడీని ఇచ్చేది. తాజాగా అలాంటి వారిపైన కూడా భారం మోపింది. నామమాత్రంగా అందించే రూ.47 సబ్సిడీని సైతం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే సిలిండర్‌ సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ మిగతా సొమ్ము నెలల తరబడి లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ క్రమంలో ఆయిల్‌ కంపెనీల తీరుపై వినియోగదారులు, ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లాలో

వంట గ్యాస్‌ ఏజెన్సీలు : 17

మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు : 2,05,250

దీపం : 46,136

ఉజ్వల : 36,960

జనరల్‌ : 83,096

గృహావసర సిలిండర్‌ పాత ధర : రూ.992

పెరిగిన తర్వాత కొత్త ధర : రూ.1,021

Advertisement
 
Advertisement
Advertisement