ఆదిలాబాద్: ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీ సాగుతోంది. క్రీడా, వ్యాయామ సాధనకు గమ్యంలా నిలవాల్సిన ప్రభుత్వ మైదానం ప్రై వేట్ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా మారింది. శిక్షణ పేరిట నిరుద్యోగుల నుంచి రూ.వేలాదిగా ఫీజులు వసూలు చేస్తున్న పోలీస్, డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని తమ వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. అకాడమీల పేరిట సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న కోచింగ్ సెంటర్లపై అధికారులు నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఎటు చూసినా వారే..
స్టేడియానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామసాధకులు, క్రీడాకారులు వందల సంఖ్యలో వస్తుంటారు. మరోవైపు క్రీడా పాఠశాల విద్యార్థులు సాధన చేస్తుంటారు. అదే సమయంలో ప్రైవేటు కోచింగ్, అకాడమీలకు చెందిన విద్యార్థులు సైతం భారీగా చేరుకుంటున్నారు. మైదానంలోని 800 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను ఆక్రమించి వ్యాయామ సాధకులు, క్రీడా పాఠశాల విద్యార్థుల సాధనకు ఆటంకం కలిగిస్తున్నారు. ఏ మూలన చూసినా అకాడమీల విద్యార్థుల గుంపులే కనిపిస్తుండడం గమనార్హం. లాంగ్ జంప్, రన్నింగ్ చేయాలనుకునే క్రీడాకారులకు ఇది తీవ్ర ఆటంకంగా మారుతుంది.
‘మామూలు’గా వ్యవహరిస్తున్న డీఎస్‌ఏ..
వీరిని కట్టడి చేయాల్సిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. కొన్నేళ్లుగా స్టేడియం వనరులను ఉచితంగా వాడుకుంటున్న శిక్షణ కేంద్రాల నిర్వహకులు పలువురు అధికారులను మచ్చిక చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో క్రీడా శాఖ బాధ్యతలు చూసిన ఓ అధికారికి రూ.వేలల్లో ముట్టజెప్పినట్లుగా కొంతమంది నిర్వాహకులు బహిరంగంగా చెప్పడం గమనార్హం. తాజాగా ప్రస్తుత డీఎస్‌ఏ అధికారులు సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
చర్యలు తీసుకుంటాం..
స్టేడియంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పేరిట శిక్షణ ఇవ్వడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. క్రీడా పాఠశాల విద్యార్థులు, వ్యాయామ సాధకులకు ఇబ్బందులు కలిగించడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు అందిస్తాం.
– జక్కుల శ్రీనివాస్, డీవైఎస్‌వో


