ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Jun 7 2026 11:51 PM | Updated on Jun 7 2026 11:51 PM

స్నేహితులతో కలిసి ‘ర్యాలీ వాగు’కు వెళ్లిన బాలుడు నీట మునుగుతుండగా భయంతో పారిపోయిన మిగతావారు విగత జీవిగా ప్రాజెక్టులో తేలిన విద్యార్థి

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌):మరో వారం రోజుల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. పదో తరగతికి వచ్చిన తమ పెద్ద కొడుకును సన్నద్ధం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. పదో తరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని ఆశపడ్డారు. కానీ, కొడుకు ఈత సరదా తల్లిదండ్రులకు తీరని శోఖం మిగిల్చింది. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేట దుబ్బపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి బోగిరి సందీప్‌(15) ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం సందీప్‌ తన స్నేహితులైన అభినయ్‌, అక్షయ్‌, అశ్విత్‌, రాంచరణ్‌తో కలిసి ముల్కల్ల శివారులోని ర్యాలీ ప్రాజెక్టులో ఈతకు వెళ్లాడు. సాయంత్రం వరకు సందీప్‌ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు ఇంటికి వచ్చినా సందీప్‌ రాకపోవడంతో బంధువులు, స్నేహితులు వివిధ చోట్ల వెతికారు. చివరకు సందీప్‌ తండ్రి రాజు హాజీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం ఉదయం సందీప్‌తో ఈతకు వెళ్లిన స్నేహితులను విచారించారు. సందీప్‌ ర్యాలీ ప్రాజెక్ట్‌లోని లోతైన నీటిలో ఈత రాకపోవడంతో మునిగిపోయినట్లు తెలిపారు. భయంతో తాము ఇంటికి వచ్చేశామని వెల్లడించారు.

గజ ఈతగాళ్లతో గాలింపు

దీంతో పోలీసులు ర్యాలీ ప్రాజెక్టుకు చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో వెతికించగా సందీప్‌ మృతదేహం లభించింది. సందీప్‌ ముల్కల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు తెరుచుకోవడానికి వారం ముందు జరిగిన ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement