కోట.. మెరిసేలా.. | - | Sakshi
Sakshi News home page

కోట.. మెరిసేలా..

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

● ఉట్నూర్‌లో గోండుల కోట పునర్నిర్మాణం ● నాటి కట్టడాలకు పర్యాటక మెరుగులు

తెలంగాణలో గోండుల పాలనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిర్పూర్‌ కేంద్రంగా దాదాపు తొమ్మిది శతాబ్దాల పాటు వీరి ఏలుబడి సాగింది. చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్‌ వరకు వీరి రాజ్యం విస్తరించింది. నాడు ఆ రాజులు నిర్మించిన కోటలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇందులో ఉట్నూర్‌ కోట ప్రస్తుతం పర్యాటకంగా రూపుదిద్దుకుంటుంది.

– ఇచ్చోడ

ఉమ్మడి ఆదిలాబాద్‌లో నాడు గోండు రాజులు నిర్మించిన కోటలు వారి పాలన, సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. ఇందులో శిథిలావస్థకు చేరిన ఉట్నూర్‌ కోటను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2023లో పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. మొత్తం రూ.3.90 కోట్లు కేటాయించగా.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.30 కోట్లు, ఐటీడీఏ మరో రూ.1.60కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పనులు 60 శాతం వరకు పూర్తయినట్లు పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే సిర్పూర్‌ పట్టణ కేంద్రంగా సుమారు పదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన మరో కోట కూడా ప్రత్యేకత సంతరించుకుంది. వీటితో పాటు మంచిర్యాల జిల్లాలోని తాండూర్‌, గాంధారి, కవ్వాల్‌, కుమురంభీం జిల్లాలో మోహ్వాడ్‌, నిర్మల్‌ జిల్లాలో బాదన్‌కుర్తి, ఎలగడప, సుర్జాపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని కనకాయి వద్ద కూడా వారు నిర్మించిన కోటలు దర్శనమిస్తున్నాయి.

ఉట్నూర్‌లోని కోటలో గల కోనేరు

ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న గోండు రాజుల కోట ప్రస్తుతం టూరిజం స్పాట్‌గా రూపుదిద్దుకుంటుంది. గోపురాలు, గోడలు, కోనేరు తదితర నిర్మాణాలకు మెరుగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయి. అయితే నిధుల లేమితో కొంత నెమ్మదిగా సాగుతున్నట్లుగా సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ను గోండురాజులు క్రీ.శ. 870–1751 వరకు పాలించారు. సిర్నూర్‌ కేంద్రంగా 19 మంది ఏకంగా 881 ఏళ్ల పాటు పాలన సాగించారు. గోండ్వానా రాజ్యాన్ని భీం బలాల్‌సింగ్‌ 870వ సంవత్సరంలో స్థాపించి 25 ఏళ్లపాటు పాలించాడు. తర్వాత మరో 18 మంది రాజులు 1751వ సంవత్సరం వరకు పాలన సాగించారు. ఉమ్మడి జిల్లాలో సిర్పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉండగా.. ఉట్నూర్‌ కూడా ప్రత్యేకత సంతరించుకుంది. అలాగే తాండురు, గాంధారి, కవ్వాల్‌తో పాటు కనకాయి, బాదన్‌కుర్తి, ఎలగడప, సుర్జాపూర్‌, మోహ్వాడ్‌ ప్రాంతాల్లో నిర్మించిన కోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

చారిత్రక

నేపథ్యం..

ఉట్నూర్‌ కోటకు మరమ్మతులు..

Advertisement
 
Advertisement
Advertisement