ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా.. పట్టింపేది?

Jun 7 2026 3:57 AM | Updated on Jun 7 2026 3:57 AM

అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం

విద్యుదాఘాతంతో కార్మికుడి దుర్మరణం

తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు

అయినా మారని యంత్రాంగం తీరు

ఆదిలాబాద్‌టౌన్‌: పొట్టకూటి కోసం పనులు చేస్తున్న కార్మికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో విద్యుత్‌ మరమ్మతులు చేస్తూ పలువురు కార్మికులు మృత్యువాత పడిన ఘటనలు చోటు చేసుకున్నా, ఆ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. తమ పనులు జరిగితే చాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నరనే ఆరోపణలున్నాయి. గతంలో జిల్లాకేంద్రంలోని నేతాజీచౌక్‌తో పాటు, పలు కాలనీల్లో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో కార్మికులు షాక్‌కు గురై ప్రాణాలు పోగుట్టుకున్నారు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు అధికారులు, కాంట్రాక్టర్లు నామామత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో మరో కార్మికుడు విద్యుదాఘాతానికి గురై శనివారం మృతిచెందాడు. ఉపాధి నిమిత్తం ఝార్ఖండ్‌ రాష్ట్రం నుంచి వచ్చి విధి నిర్వహణలో ఇక్కడ ప్రాణాలు వదలడం గమనార్హం. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

అసలేం జరిగిందంటే..

ఆదిలాబాద్‌ పట్టణంలోని రాణిసతీజి కాలనీలో డ్యామేజ్‌ స్తంభాల తొలగింపు, ఇతర మరమ్మతు పనులు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కార్మికుడు సురేశ్‌కుమార్‌(24) స్తంభంపైకి ఎక్కి పనులు చేపడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ తీగలకు కరెంట్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై విలవిల్లాడాడు. కింద ఉన్న కార్మికులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. విద్యుత్‌ నిలిపివేసినా షాక్‌కు గురికావడంతో అక్కడ ఉన్న కార్మికుల్లో భయాందోళన నెలకొంది. క్షణాల్లోనే విద్యుత్‌ స్తంభంపై కార్మికుడు ప్రాణాలు వదిలాడు. కింద ఉన్న ఇద్దరు కార్మికులు స్తంభం పైకి ఎక్కి షాక్‌కు గురైన కార్మికుడికి కిందకు దించారు. రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతిడికి ఇద్దరు పిల్లల(ఐదేళ్లు, మూడేళ్ల వయస్సు)తో పాటు భార్య ఉంది. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

పర్యవేక్షణ లోపమే కారణమా..?

ఇటీవల విద్యుత్‌ శాఖలో పనిచేసే పలువురు ఉద్యోగులతో పాటు, కార్మికులు కరెంట్‌ షాక్‌ గురై ప్రాణాలు పోతు న్నా సంబంధిత అధికారుల తీరులో మార్పుకానరావడం లేదనే ఆరోపణలున్నాయి. మరమ్మతు పనులు చేపట్టే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఆఫ్‌ చేసి పనులు చేస్తున్నప్పటికీ సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇంట్లో అమర్చుకుంటున్న ఇన్వర్టర్‌ నుంచి విద్యుత్‌ వెనక్కి సరఫరా కావడంతో ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పనులు జరిగే సమయంలో అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సి ఉండగా, పట్టించుకోని కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విషయమై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషారావును వివరణ కోరగా, విద్యుత్‌ మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఇన్వర్టర్‌ ద్వారా కరెంట్‌ సరఫరా కావడంతో షాక్‌ గురై మృతి చెందాడని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement