ఇం‘ధన’ భారం! | - | Sakshi
Sakshi News home page

ఇం‘ధన’ భారం!

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ● సామాన్యుడి జేబుకు చిల్లు ● రవాణారంగంపై తీవ్ర ప్రభావం

కై లాస్‌నగర్‌: ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే గ్యాస్‌ ధర మండగా తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ వంతయింది. ఆయిల్‌ కంపెనీలు లీటర్‌పై ఏకంగా రూ.3చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి రావడంతో బంకులకు వెళ్లిన వాహనదారులు షాక్‌కు గురయ్యారు. ఈ పెంపుతో జిల్లాపై రోజుకు రూ.7.26లక్షల భారం పడనుంది. అలాగే ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై కూడా చూపే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

రోజుకు రూ.7.26లక్షల భారం

జిల్లా వ్యాప్తంగా వివిధ ఆయిల్‌ కంపెనీలకు సంబంధించి 70 బంక్‌లు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా రోజుకు 70వేల నుంచి 80వేల లీటర్ల పెట్రోల్‌ వినియోగమవుతుంది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.3 పెంచినప్పటికీ జిల్లాకు వచ్చేసరికి మరో 39 పైసలు అదనంగా పెరిగాయి. ఈ లెక్కన వాహనదారులపై పెట్రోల్‌ అదనపు భారం రోజుకు రూ.2.37లక్షల వరకు పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే రూ.71లక్షలుపైనే. ఇక డీజిల్‌ రేటు జిల్లాలో లీటర్‌కు రూ.3.26 పైసలు పెరగగా.. రోజుకు 1.50 లక్షల నుంచి 1.70 లక్షల లీటర్లు వినియోగమవుతుంది. ఈ లెక్కన వాహనదారులపై రూ.4.89 లక్షల భారం పడుతుంది. నెలవారీగా పరిశీలిస్తే అదనపు భారం రూ.1.46కోట్లకు పైనే ఉండనుంది. ఇది రవాణారంగంతో పాటు నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

పేదలపై పెను భారం

ఇంధన ధరల పెంపుతో వాహనదారులపైనే కాకుండా పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావం పడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. రవాణా చార్జీలు సైతం పెరగనున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారనుంది.

జిల్లాలోని పెట్రోల్‌ బంక్‌లు : 70

పెరిగిన ఇంధన ధరలు

పాత ధర ప్రస్తుతం

పెట్రోల్‌ రూ.108.86 రూ.112.25

డీజిల్‌ రూ.97.13 రూ.100.39

Advertisement
 
Advertisement
Advertisement