పంచాయతీలకు నిధులొచ్చాయ్
తాజాగా రూ.12.97 కోట్లు విడుదల పక్షం రోజుల్లో 20.31కోట్ల మేర జీపీ ఖాతాల్లో జమ ఈఎంఐలు, పెండింగ్ బిల్లులకు సరిపోయేనా?
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీలకు ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. ఇటీవల నూతన పాలకవర్గాలు కొలువుదీరడంతో పెండింగ్‌లో ఉన్న 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా రూ.12.09 కోట్లు నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో సర్పంచ్‌ల పాలన అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు విడుతల్లో కలిపి రూ.20.31 కోట్లు పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విడుదలైన ఈ నిధులు ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్ చార్జీలకు ఖర్చయ్యే అవకాశముందని కార్యదర్శులు చెబుతున్నారు. వేసవి ప్రారంభం కావడంతో ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండదంటున్నారు. కాగా, మాజీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు క్లియరయ్యే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు.
రూ.20.31కోట్ల జమ..
జిల్లాలోని 473 గ్రామ పంచాయతీలకు గాను విడతల వారీగా రూ.20కోట్ల 31లక్షల 83వేల 331ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం వాటిని జనాభా ప్రతిపాదికన నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేసింది. ఇందులో రూ.12కోట్ల 9లక్షల 76వేల 507లను శుక్రవారం విడుదల చేసింది. తొలుత రూ.8కోట్ల 06లక్షల 50,964 విడుదల కాగా తర్వాత రూ.9లక్షల 32వేల 694లు, మరో సారి రూ.6లక్షల 23వేల166 నిధులను విడతలవా రీగా మంజూరు చేసింది. రెండేళ్లుగా నిధుల లేమితో సతతమవుతున్న పంచాయతీలకు ఈ నిధుల విడుదలతో కాస్తా ఊరట లభించినట్‌లైంది.
ఈఎంఐలు, సీసీ చార్జీలకే సరి
రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీల్లో ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు, కరెంట్ బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తాయనే ఉద్దేశంతో గత పంచాయతీల పాలకవర్గం ముగిసే సమయంలో అప్పటి సర్పంచ్‌లు అడ్వాన్స్‌గా పనులు చేపట్టారు. చాలాచోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి చేశారు. అయితే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోగా, 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. ఇటీవల ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మాజీ సర్పంచ్‌లు చేసిన కొద్దిపాటి బిల్లులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. సర్పంచ్‌ల బిల్లులతో పాటు పంచాయతీల నిర్వహణ కోసం కార్యదర్శలు అప్పులు చేసి మరీ పనులు చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా ఇతరాత్రా పనులు చేపట్టేందుకు తమ జేబుల్లో నుంచి వెచ్చించారు. ప్రస్తుతం ఈ బకాయిలు కూడా పేరుకుపోయాయి. వీటితో పాటు ట్రాక్టర్ కిస్తీలు, కరెంట్ బిల్లులు చెల్లించేందుకు పంచాయతీ ఖజనాలో డబ్బులు లేకపోవడంతో భారీగా పెండింగ్ పడ్డాయి. ప్రస్తుతం నిధుల విడుదల కావడంతో ఇలాంటి బకాయిలు క్లియరయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో బ్యాంకర్లు పంచాయతీ ఖజానాలో జమయ్యే నిధులను ఆటోమెటిక్‌గా డెబిట్ చేసుకునే అవకాశముంటుంది. దీంతో జీపీల్లో వాటిని ఇతర పనులకు ఉపయోగించే అవకాశం ఉండదు. కనుక ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
తాజాగా విడుదలైన నిధుల వివరాలు (మండలాల వారీగా)
మండలం విడుదలైన
నిధులు(రూ.లలో)
ఆదిలాబాద్‌రూరల్ 74,66,225
బజార్‌హత్నూర్ 65,32,125
బేల 62,59,706
భీంపూర్ 50,30,532
భోరజ్ 32,27,583
బోథ్ 72,33,988
గాదిగూడ 53,21,262
గుడిహత్నూర్ 66,93,021
ఇచ్చోడ 89,20,582
ఇంద్రవెల్లి 94,27,789
జైనథ్ 44,44,264
మావల 13,13,907
నార్నూర్ 73,83,357
నేరడిగొండ 66,16,962
సాత్నాల 30,31,117
సిరికొండ 37,56,967సొనాల 28,41,578
తలమడుగు 69,77,765
తాంసి 32,85,375
ఉట్నూర్ 1,52,12,402


