లెక్చరర్లకూ టార్గెట్లు.. | - | Sakshi
Sakshi News home page

లెక్చరర్లకూ టార్గెట్లు..

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

లెక్చరర్లకూ టార్గెట్లు..

లెక్చరర్లకూ టార్గెట్లు..

‘పది’ పరీక్షలకు ముందే ఇంటర్‌ ప్రవేశాలు విద్యార్థుల ఇళ్ల బాటలో పీఆర్వోలు, లెక్చరర్లు ఆఫర్ల పేరిట తల్లిదండ్రులకు గాలం

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పర్వానికి తెరలేపాయి. పీఆర్వోలు, లెక్చరర్ల సాయంతో విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి నమ్మబలుకుతున్నారు. ఇప్పుడే అడ్మిషన్‌ తీసుకుంటే డిస్కౌంట్‌ వర్తిస్తుందని తర్వాత సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉంటుందని భయపెడుతున్నారు. నిజమే అని భావించిన పేరెంట్స్‌ సరే అంటున్నారు. తీరా అడ్మిషన్‌ పొందిన తర్వాత పరీక్షల సమయంలో ఫీజుల కోసం ఇబ్బందులకు గురిచేయడం యాజమాన్యాలకు పరిపాటిగా మారింది. పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.

రూ.లక్షల్లో ఫీజులు..

తాము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. మెయిన్స్‌, అడ్వాన్స్‌, నీట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెబుతున్న యాజమాన్యాలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వేలల్లో ఒకరిద్దరికి వచ్చే ర్యాంకులను చూపి మాయమాటలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అది నిజమే అని నమ్మిన చాలా మంది పేరెంట్స్‌ ప్లాట్లు, ఇండ్లు, పొలాలు, స్థిరాస్తులను అమ్ముకొని తమ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి.

ఆఫర్లతో ఆకట్టుకుంటూ..

జిల్లాలోని ఆయా కళాశాలల యాజమాన్యాలు నియమించుకున్న పీఆర్‌వోలు రెండు నెలల ముందు నుంచే విద్యార్థుల ఇళ్ల బాట పట్టారు. ఆఫర్ల పేరిట తల్లిదండ్రులను ఆకర్షిస్తూ జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. దసరా సెలవుల సమయంలో ఆయా పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్‌ నంబర్లు, చిరునామాలు సేకరించి తర్వాత నుంచి తమ పని కానిచ్చేస్తున్నారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, తదితర ప్రాంతాలకు చెందిన కళాశాలలకు చెందిన పీఆరోలు జిల్లాలో 50 మంది వరకు ఉండడం గమనార్హం. కాగా, పదో తరగతి పరీక్షలు పూర్తి కాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని ఇంటర్మీడియెట్‌ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలను నమ్మి తమ పిల్లలను చేర్పించవద్దు. సర్కారు కళాశాలల్లో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. ప్రైవేట్‌ కళాశాలలు ముందస్తుగా అడ్మిషన్లు తీసుకోవద్దు. మార్చి13 తర్వాత అఫ్లియేషన్‌ ఇవ్వడం జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు.

– జాదవ్‌ గణేశ్‌కుమార్‌, డీఐఈవో

తమ కళాశాలలో విద్యార్థులను చేర్పించిన పీఆర్‌వోతకు సంబంధిత యాజమాన్యాలు రూ.వెయ్యి నుంచి రూ.5వేల చొప్పున నజరానాగా చెల్లిస్తోంది. మరోవైపు సంబంధిత కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తప్పకుండా 20 వరకు అడ్మిషన్‌లు తీసుకురావాలని ఆయా మేనేజ్‌మెంట్లు టార్గెట్లు విధిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఉదయం, సాయంత్రం విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు. తల్లిదండ్రులను ఆఫర్లు, మాయమాటలతో మచ్చిక చేసుకుంటూ లక్ష్యాలను పూర్తి చేసుకుంటున్నారు. ఒకసారి అడ్మిషన్‌ పొందితే ఆ విద్యార్థి రెండేళ్ల పాటు చదవాల్సిందే. మధ్యలో వెళ్తే ఫీజు కట్టాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement