గల్ఫ్ మృతుల కుటుంబాల దీనస్థితిపై అధ్యయనం
లక్ష్మణచాంద: గల్ఫ్ దేశాలలో ఉపాధి కోసం వెళ్లి ఆకస్మికంగా మరణిస్తున్న కార్మికుల కుటుంబాల పరిస్థితులను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను జాతీయస్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ఢిల్లీకి చెందిన ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ పూనమ్ అగర్వాల్ శుక్రవారం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో పర్యటించారు. గత ఐదు నెలల క్రితం దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన బీమా రమేశ్ కుటుంబాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రమేశ్ భార్య, తల్లిదండ్రులతో మాట్లాడారు. రమేశ్ మరణానికి గల కారణాలు, మృతదేహం స్వదేశానికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిందా.. వంటి వివరాలను ఆమె ఆరా తీశారు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు మరణించినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో ఎన్నారై అడ్వైజర్ కమిటీ సభ్యులు స్వదేశ్ పరికిపండ్ల, నిర్మల్ మార్కెట్ వైస్‌చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఒస రాజేశ్వర్, జిల్లా కిసాన్‌సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్ల పోతారెడ్డి, బిక్నూర్ రాజు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


