‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 14 నుంచి ఏప్రిల్ 15వరకు నిర్వహించనున్న పరీక్షలకు జిల్లాలో 10,928 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లుగా పేర్కొన్నారు. ఇందుకోసం 52 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధులకు సంబంధించి 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది సి–కస్టోడియన్లను నియమించినట్లు పేర్కొన్నారు. ఆయా సెంటర్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా పత్రాల రవాణాకు, ఫ్లయింగ్ స్క్వాడ్ల కోసం తగిన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖా అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షల సమయానుకూలంగా బస్సు వేళలను సర్దుబాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్, పోలీస్, రవాణా, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


