అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Mar 1 2026 7:45 AM | Updated on Mar 1 2026 7:45 AM

అభివృ

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

● సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● ‘దిశ’ సమావేశంలో ఎంపీ నగేశ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అలాగే ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శనివారం నిర్వహించగా, కలెక్టర్‌ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌ ఏజెండా వివరాలు చదివి వినిపించారు. అనంతరం 50 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి శాఖల పరంగా తీసుకుంటున్న చర్యలు, పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రభుత్వ గ్రాంట్లు, నిధుల అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను రాబోయే 45 రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన అమలుపై ఆరా తీశారు. ప్రతీ రైతుకు సాయిల్‌ హెల్త్‌ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. పశువ్యాధి నియంత్రణ, ఉద్యానవన శాఖ ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. యువతకు పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు. మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్డీవోను ఆదేశించారు. పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన గ్రామీణ రోడ్డు పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో మిషన్‌ అమృత్‌ కింద తాగునీరు, మురుగునీటి పారుదల పనులను వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. వీటితో పాటు జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్ల ఏర్పాటు, డిజిటల్‌ ఇండియా, భూ రికార్డుల ఆధునికీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లను త్వరగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, జాతీయ రహదారుల నిర్మాణం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్‌ పంపిణీ సక్రమంగా జరగాలని, బీసీ, మైనారిటీ వెల్ఫేర్‌ పథకాల్లో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి1
1/1

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement