అడుగులు పడ్డాయి! | - | Sakshi
Sakshi News home page

అడుగులు పడ్డాయి!

Feb 27 2026 7:25 AM | Updated on Feb 27 2026 7:25 AM

అడుగులు పడ్డాయి!

అడుగులు పడ్డాయి!

● జిల్లాలో పర్యటించిన ప్రభుత్వ పెద్దలు ● హెలిక్యాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే ● పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు ● ప్రతిపాదిత భూములు పరిశీలన

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రతిపాదిత పారిశ్రామిక వాడ కోసం భూములను పరిశీలించేందుకు ప్రభుత్వ పెద్దలు జిల్లాకు వచ్చారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణంతో పాటు పదివేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్‌రెడ్డి, పీ సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ఎండీ కే శశాంక గురువారం హెలిక్యాప్టర్‌లో ఆదిలాబాద్‌కు వచ్చారు. కొరాటా–చనాక ప్రాజెక్ట్‌, హత్తిఘాట్‌ పంప్‌హౌస్‌ను పరిశీలించారు. ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై సమీక్షించారు. ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, కలెక్టర్‌ రాజర్షి షా వారికి స్వాగతం పలికారు. మొదట హెలిక్యాప్టర్‌లో పెన్‌గంగా సమీపంలోని భూములను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు.

పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం

జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు 10వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ సృష్టించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. ఇందుకోసం వివిధ భూములను పరిశీలిస్తోంది. పెన్‌గంగా నది సమీప ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉందని అధికారులు ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సదరు భూములను పరిశీలించేందుకు ప్రభుత్వ పెద్దలు ఇక్కడికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హెలిక్యాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించి కొరాటా–చనాక ప్రాజెక్ట్‌ సమీపంలోని గ్రామాలు, ప్రభుత్వ భూములు, సాగు భూములు, సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించారు. నీరు, విద్యుత్‌, జాతీయ రహదారి, రైల్వే మార్గం, ప్రతిపాదిత విమానాశ్రయం లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, సీసీఐ సిమెంట్‌ ప్యాక్టరీని కూడా పరిశీలించారనే ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్‌ ప్రాంతంలో కొత్తగా రెండు సిమెంట్‌ ప్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చినట్లు చర్చించుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు.

ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం

పారిశ్రామిక వాడ ద్వారా వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, రైతుల భూముల విలువ పెరగడం, జిల్లా అర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యమని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. జిల్లాకు వచ్చిన ప్రభుత్వ పెద్దలను కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, కాంగ్రెస్‌ నాయకులు హత్తిఘాట్‌ పంప్‌హౌస్‌ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ బ్యారేజీ నుంచి ఆదిలాబాద్‌కు తాగునీటి సౌకర్యం కల్పించాలని వారిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement