మరింత ‘సూపర్’
రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో 10 మంది స్పెషలిస్టుల నియామకం విధుల్లో చేరిన ఐదుగురు మొత్తం ఏడు విభాగాల్లో సేవలు అందుబాటులోకి కార్డియాలజిస్టు రోగులకు తప్పనున్న తిప్పలు
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మరిన్ని వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కోట్ల రూపాయలతో నిర్మించినా.. ఆధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నా స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందలేదు. ఈక్రమంలో హైదరాబాద్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసేవారు. ఇప్పుడు ఆ సమస్య కొంత తీరనుంది. ఇదివరకు ఐదు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రాగా, మరో రెండు విభాగాల్లో వైద్యుల నియామకం చేపట్టారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. హార్ట్ ఎటాక్‌వచ్చిన సమయంలో ఇతర ప్రాంతాలకు తరిలిస్తుండగా, రిమ్స్‌కు వైద్యం కోసం వచ్చిన సందర్భాల్లో మృత్యువాత పడిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి. ఏళ్లుగా ఈ పోస్టు భర్తీ కోసం రోగులు ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ప్రక్రియ పూర్తయింది. దీంతో సూపర్ స్పెషాలిటీలో మరింత నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి.
తీరనున్న వైద్యుల కొరత..
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు రిమ్స్ వరప్రదాయినిగా ఉంది. అయితే దీనికి అనుసందానంగా 2022 మార్చి 3న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. 9 రకాల వైద్యసేవలు అందించాల్సి ఉండగా కొన్నేళ్లుగా రెండు మూడు విభాగాల్లోనే సేవలు అందుతూ వచ్చాయి. రిమ్స్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ ప్రభుత్వానికి పలుమార్లు ఇందులో పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం జరగలేదు. కొంత మంది ఆయా విభాగాల్లో చేరినప్పటికీ మళ్లీ వెళ్లిపోయారు. అయితే ఇటీవల పీజీ పూర్తి చేసుకున్న వైద్యులకు ఏడాది పాటు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు అందించాల్సి ఉంది. అయితే జిల్లాకు పది మంది వైద్యులను కేటాయించారు. ప్రస్తుతం ఐదుగురు రిపోర్టు చేశారు. కేటాయించిన పోస్టుల్లో కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ 2, నెఫ్రాలజీ 2, న్యూరాలజీ 2, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ2 పోస్టులు ఉన్నాయి. విధుల్లో చేరిన వారిలో న్యూరో ఫిజీషియన్, న్యూరో సర్జన్, ప్లాస్టిక్ సర్టన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ ఉన్నారు. మిగతా వారు చేరనున్నట్లు త్వరలో రిమ్స్ అధికారులు చెబుతున్నారు.
తీరనున్న అవస్థలు..
రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో ప్రస్తుతం యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతానికి కార్డియాలజీ, న్యూరో ఫిజీషియన్, నెఫ్రాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు మహారాష్ట్ర వాసులకు ప్రయోజనం చేకూరనుంది. సూపర్ సేవలతో పాటు ఈఎన్‌టీ, డర్మటాలజీ, ఫిజియోథెరపీ, ఇతర సేవలు అందిస్తున్నారు. అయితే వారానికి రెండు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మిగతా రోజుల్లో శస్త్ర చికిత్సలు, ఇతర సేవలు అందించనున్నారు.
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
రిమ్స్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. సూపర్ స్పెషాలిటీలో వైద్యుల కొరత ఉండగా, ఆ సమస్య తీరనుంది. ఇక కార్డియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు నెఫ్రాలజీ, గ్యాస్ట్రాలజీ సేవలను ప్రారంభిస్తున్నాం. ఇదివరకు ఐదు విభాగాల్లో సేవలు అందుతున్నాయి. త్వరలో మిగతా సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. రోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్


